E-Paper
Advertisement

Nampally FSL Fire: ఎఫ్​ఎస్ఎల్‌ అగ్నిప్రమాదంలో.. కీలక కేసుల్లోని ఆధారాలు దగ్ధం..?

Nampally FSL Fire: ఎఫ్​ఎస్ఎల్‌ అగ్నిప్రమాదంలో.. కీలక కేసుల్లోని ఆధారాలు దగ్ధం..?
Advertisement

Nampally FSL Fire: స్వేఛ్చ బ్యూరో: నాంపల్లిలోని ఫోరెన్సిక్​ సైన్స్​ లేబోరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్)లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్​ ల్యాబ్ లో మొదలైన మంటలు క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదంలో పలు కీలక కేసుల్లో సీజ్​ చేసిన సాక్ష్యాధారాలు, పైళ్లు, కంప్యూటర్లు కాలి బూడిదైపోయాయి. ఏయే కేసులకు సంబంధించిన కంప్యూటర్లు, ఫైళ్లు, సాక్ష్యాధారాలు అగ్నికి ఆహుతయ్యాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఫోన్​ ట్యాపింగ్, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంతోపాటు కొన్ని ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఆధారాలు తగులబడి పోయాయన్న వార్తలు వచ్చాయి. ఎఫ్ఎస్​ఎల్ లో ఆఫీస్​ బాయ్​ గా పని చేస్తున్న ఓ ఉద్యోగి మంటలు ఆర్పటానికి ప్రయత్నించి అస్వస్థతకు గురి కాగా ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు చెబుతున్నారు. సమగ్ర విచారణ జరిపితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది స్పష్టం కాగలదన్నారు. సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కంప్యూటర్ ల్యాబ్ లో..

రెడ్ హిల్స్​ లోని నాంపల్లి పోలీస్​ స్టేషన్​ పక్కనే ఉన్న ఎఫ్ఎస్​ఎల్​ భవనం మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్​ లో శనివారం ఉదయం 10గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో అక్కడ నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మంటలు తలెత్తిన వెంటనే ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఫైర్​ ఎస్టింగ్విషర్​ ద్వారా వాటిని ఆర్పటానికి ప్రయత్నించాడు. అయితే, క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసి దట్టంగా పొగ రావటం మొదలు కావటంతో అతను అస్వస్థతకు గురయ్యాడు. దాంతో ఆఫీస్​ బాయ్​ తోపాటు భవనంలో ఉన్న మిగితా ముగ్గురు ఉద్యోగులు పరుగున బయటకు వచ్చేశారు. ఆ తరువాత కంప్యూటర్ ల్యాబ్​ లో మరింతగా ఎగిసి పడ్డ మంటలు వేర్వేరు కేసుల్లో సీజ్ చేసిన భౌతిక సాక్ష్యాధారాలను భద్రపరిచిన గదికి కూడా వ్యాపించాయి. ఈ క్రమంలో ల్యాబ్ లోని కంప్యూటర్లతోపాటు సాక్ష్యాధారాలు భద్రపరిచిన గదిలోని దాదాపు యాభై కంప్యూటర్లు, ఇతర డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు, వీడియోలు అగ్నికి ఆహుతైపోయాయి.

అయిదు ఫైరింజన్లు..

Advertisement

ప్రమాదం మొదలైన రెండు క్షణాల్లోనే విషయం తెలిసి నాంపల్లి పోలీసులు ఎఫ్​ఎస్​ఎల్ భవనం వద్దకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆ వెంటనే రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, తేలికగా మండే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో మంటలు అదుపులోకి రాలేదు. అంతకంతకూ ఎగిసి పడుతూ వచ్చాయి. దాంతో అసెంబ్లీలో ఉన్న మరో మూడు ఫైరింజన్లను కూడా అక్కడికి రప్పించారు. అయిదు ఫైరింజన్లతో దాదాపు నాలుగు గంటలు శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే, చాలాసేపటి వరకు ప్రమాదం జరిగిన మొదటి అంతస్తు నుంచి దట్టమైన పొగ వెలువడటంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేక పోయారు. భవనం రెండో అంతస్తులో పెద్ద ఎత్తున కెమికల్స్ ను భద్రపరిచి ఉంచారు. ఆ అంతస్తుకు కూడా మంటలు వ్యాపించి ఉంటే ప్రమాదం తీవ్రత మరింత పెరిగేదని అగ్నిమాపక సిబ్బంది అన్నారు.

Also Read: Green mirchi: పచ్చిమిరపకాయలు తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుందా?

కీలక కేసుల్లోని..

Advertisement

ఈ ప్రమాదంలో ఫోన్​ ట్యాపింగ్​, ఎమ్మెల్యేల కొనుగోలుతోపాటు పలు సంచలన కేసులకు సంబంధించిన భౌతిక సాక్ష్యాధారాలు దహనం అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, అధికారులు దీనిని ధృవీకరించ లేదు. అగ్నిప్రమాదం గురించి తెలియగానే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మొదట సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఉదయం 10గంటల సమయంలో ప్రమాదం గురించి సమాచారం తెలిసినట్టు చెప్పారు. షార్ట్ సర్క్యూట్​ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమిక విచారణ ద్వారా తెలిసిందన్నారు. ఎఫ్ఎస్​ఎల్​ భవనం మొదటి అంతస్తులో నేర పరిశోధనకు సంభంధించిన ఫైళ్లు, ఆధారాలు భద్రపరుస్తారని చెప్పారు. ఆయా కేసులకు సంబంధించిన ఆపరేషన్​ ఈ ల్యాబ్​ నుంచే జరుగుతుందన్నారు. కంప్యూటర్లు కూడా ఇదే అంతస్తులో ఉంటాయన్నారు. మంటల్లో ఏయే కేసులకు సంబంధించిన ఫైళ్లు, ఆధారాలు కాలి పోయాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. సమగ్ర విచారణ జరిపితేనే అన్ని విషయాలు స్పష్టమవుతాయన్నారు. ప్రమాదం జరిగినపుడు ఆఫీస్​ లో నలుగురు ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వీరిలో ఓ ఉద్యోగి మంటలను ఆర్పటానికి ప్రయత్నించి అస్వస్థతకు గురవటంతో 108లో ఆస్పత్రికి తరలించినట్టు తెలియచేశారు. ప్రమాద స్థలానికి నార్త్​ జోన్​ డీఐజీ శ్వేత వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

హార్డ్​ డిస్కులు కాలిపోయాయి..

అయిదు ఫైరింజన్లతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీదాస్​ చెప్పారు. మొదటి అంతస్తులో వేర్వేరు కేసులకు సంబంధించి సీజ్ చేసిన ప్రాపర్టీని భద్రపరిచిన విభాగంలో అగ్నిప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఆయా కేసుల్లో సీజ్ చేసిన విలువైన హార్డ్​ డిస్కులు, డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతైనట్టుగా చెప్పారు. ఉదయం 10.22గంటలకు ప్రమాదం గురించి తమకు సమాచారం వచ్చినట్టు తెలిపారు. నిమిషాల్లోనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారన్నారు. అప్పటికే మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయని తెలిపారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్​ మొత్తం రెండో అంతస్తులో ఉందన్నారు. అక్కడికి మంటలు వ్యాపించి ఉన్నట్టయితే ప్రమాద తీవ్రత మరింతగా ఉండేదని చెప్పారు. మొదటి అంతస్తులో తేలికగా మండే స్వభావం ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, డాక్యుమెంట్లు ఎక్కువగా ఉండటంతో క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయన్నారు. హార్డ్​ డిస్కులు పూర్తిగా కాలిపోయాయా? పాక్షికంగా దహనమయ్యాయా? అన్నది పరిశీలించాల్సి ఉందని చెప్పారు. జరిగిన ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Annavaram: అన్నవరం వెళ్తున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×