E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వైద్య చరిత్రలోనే మహా అద్భుతం.. ఒకేసారి 5 అవయవాల మార్పిడితో యువకుడికి పునర్జన్మ!

వైద్య చరిత్రలోనే మహా అద్భుతం.. ఒకేసారి 5 అవయవాల మార్పిడితో యువకుడికి పునర్జన్మ!
Advertisement

Organ Transplant: వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన, క్లిష్టమైన ఘనతను సొంతం చేసుకుని హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోగికి ఒకే సమయంలో ఏకంగా ఐదు కీలక అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసి, దేశ వైద్య రంగం చూపును తనవైపు తిప్పుకుంది. కార్పొరేట్ ఆస్పత్రులకే సవాల్ విసిరేలా, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సరికొత్త అద్భుతం జరగడం భారతీయ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

మృత్యువుపై పోరాటం
సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్ శ్రీశైలం గౌడ్ ‘ఫ్యామిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్’ (FAP) అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధితో పాటు పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది పెద్దపేగును, చిన్నపేగులో ఎక్కువ భాగాన్ని కోల్పోయిన అతనికి ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి పూర్తిగా నశించింది. తీవ్ర పోషకాహార లోపం, నరకయాతనతో ఆరు నెలల క్రితం ఉస్మానియాను ఆశ్రయించగా.. పరీక్షించిన వైద్యులు అతని జీర్ణాశయం, డ్యుయోడినం, ప్యాంక్రియాస్, చిన్నపేగు, కుడివైపు పెద్దపేగు పూర్తిగా పాడైపోయాయని గుర్తించారు. ఈ ఐదు అవయవాల మార్పిడి (మల్టీ విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) ఒక్కటే అతడిని బ్రతికించే ఆఖరి మార్గమని తేల్చారు.

Advertisement

36 గంటల మహా యజ్ఞం.. వైద్యుల అవిశ్రాంత శ్రమ
అదే సమయంలో ఉస్మానియాలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళా రోగి కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు రావడంతో శ్రీశైలం గౌడ్‌కు కొత్త ఆశలు చిగురించాయి. దాత శరీరం నుండి జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఐదు అవయవాలను ఒకే క్లస్టర్‌గా సేకరించిన వైద్యులు, జూన్ 29 నుండి 30వ తేదీ సాయంత్రం వరకు ఏకధాటిగా 36 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సిహెచ్. మధుసూదన్ నేతృత్వంలో వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది షిఫ్టుల వారీగా రాత్రింబవళ్లు శ్రమించారు. అంత సుదీర్ఘ సమయం పాటు రోగిని అనస్థీషియా స్థితిలో ఉంచి, బీపీ, పల్స్ పడిపోకుండా కాపాడటం వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతంగా నిలిచింది.

కార్పొరేట్ సవాల్‌ను దాటిన ప్రభుత్వ వైద్యం
సాధారణంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి అత్యంత క్లిష్టమైన మల్టీ విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటే రూ. కోటికి పైనే ఖర్చవుతుంది. అంత పెద్ద మొత్తాన్ని భరించే శక్తి లేని ఆ పేద కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వ ‘ఆరోగ్యశ్రీ పథకం’ కొండంత అండగా నిలిచింది. అత్యధిక రిస్క్ ఉండటం వల్ల కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సైతం వెనకడుగు వేసే ఇలాంటి శస్త్రచికిత్సను, ఉస్మానియా ప్రభుత్వ వైద్యులు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా విజయవంతం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పైగా, అదే దాత ఇచ్చిన కళ్లు, చర్మం, కాలేయం, మూత్రపిండాల ద్వారా మరో నలుగురికి కూడా పునర్జన్మ లభించడం విశేషం.

Advertisement

దేశవ్యాప్త ప్రశంసలు.. జాతీయ స్థాయిలో గుర్తింపు
జాతీయ వైద్యుల దినోత్సవం (Doctors’ Day) సందర్భంగా ఉస్మానియా వైద్య బృందం సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. జాతీయ అవయవాలు, కణజాల మార్పిడి సంస్థ (NOTTO) ఈ ఘనతను ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వైద్యుల అలుపెరుగని కృషిని కొనియాడగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యరంగంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా, వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఒక యువకుడికి పునర్జన్మను ప్రసాదించిన తీరు నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

Also Read: దమ్ముంటే చర్చకు రండి.. ముక్కు నేలకు రాస్తా.. బావ బామ్మర్దులకు మంత్రి జూపల్లి ఓపెన్ ఛాలెంజ్!

Related News

తప్పు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి జూపల్లి

దమ్ముంటే చర్చకు రండి.. ముక్కు నేలకు రాస్తా.. బావ బామ్మర్దులకు మంత్రి జూపల్లి ఓపెన్ ఛాలెంజ్!

మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7,345 కోట్లతో తొలి దశకు క్యాబినెట్ ఓకే!

మబ్బు పట్టింది.. వాన పడింది! రెండు రాష్ట్రాల్లో వాతావరణం కూల్.. కానీ ఆ ఇబ్బందులు తప్పట్లేదుగా!

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్.. ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు నిలిపివేత!

Yadagirigutta: ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో పదవులా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు..!

Big Stories

×