22A Land: ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా 22ఏ జాబితాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు.
మేడ్చల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలను ఆయన తనిఖీ చేసి 22ఏకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అప్‌డేట్ చేసిన జాబితా ప్రకారం 22ఏ దరఖాస్తులను పరిశీలించి, ప్రజలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకునే సమయానికి సంబంధిత భూమికి క్లియరెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read: జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!
మేడ్చల్, దుండిగల్ తహసీల్దార్ల వద్ద ఉన్న 22ఏ జాబితాలోని ప్రతి దరఖాస్తును సర్వే నంబర్లతో సహా రిజిస్ట్రేషన్ కార్యాలయాల జాబితాలతో సరిపోల్చి పరిశీలించారు. నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు లింక్ డాక్యుమెంట్ల ఆధారంగా సమగ్రంగా వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా యూఎల్‌సీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, అర్హత ఉన్న దరఖాస్తులను జాబితా నుంచి వెంటనే క్లియర్ చేయాలని సూచించారు.
యూఎల్‌సీలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్లాట్ బుక్ చేసిన తర్వాత డాక్యుమెంట్లు పెండింగ్‌లో ఉండకుండా సబ్ రిజిస్ట్రార్లతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని సెక్షన్ 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యలపై అధికారులతో ఆయన సమగ్రంగా సమీక్షించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ ఆశోక్, మేడ్చల్ తహసీల్దార్ భూపాల్, దుండిగల్ తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: మీ ఇంటి చుట్టూ పాములు తిరుగుతున్నాయా? ఈ 6 పొరపాట్లే కారణమట!