22A Land Dispute: 22ఏ నిషేధిత భూముల జాబితాపై నెలకొన్న గందరగోళాన్ని తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22ఏ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు దిశా నిర్దేశం చేశారు.
బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నప్పటికీ 22ఏ అంశంపై రెవెన్యూ శాఖ కమిషనర్, కలెక్టర్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 22ఏ జాబితాలోని భూమికి సంబంధించిన ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. సంబంధిత భూమి 22ఏ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏంటి? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏంటి? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Also Read: ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!
రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 22ఏ భూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను పరిరక్షించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తేల్చి చెప్పారు.
Also Read: అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ ఇచ్చిన సీఎం!