UPHC Inspection: గాజులరామారం యూపీహెచ్‌సీని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్‌టీ) ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు గుర్తించారు. దీనిపై సంబంధిత సిబ్బందిని వివరణ కోరిన డీఎంహెచ్‌ఓ.. విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
యూపీహెచ్‌సీలోని మందుల నిల్వలను స్టాక్ రిజిస్టర్‌తో సరిపోల్చి పరిశీలించారు. మందుల లభ్యత, ముఖ్యంగా సమీప గడువు (నియర్ ఎక్స్‌పైరీ) ఉన్న మందుల వివరాలను తనిఖీ చేసి, వాటి వినియోగం, నిల్వల నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్, యాంటీ స్నేక్ వీనం నిల్వలు, వాటి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్లు, ఇతర అత్యవసర మందుల కోల్డ్‌చైన్ నిర్వహణను తనిఖీ చేసి, రికార్డుల్లోని వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదైన సమాచారంతో క్రాస్ వెరిఫై చేశారు. యూపీహెచ్‌సీలో వైద్య సేవల పనితీరుపై డీఎంహెచ్‌ఓ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: మీ ఇంటి చుట్టూ పాములు తిరుగుతున్నాయా? ఈ 6 పొరపాట్లే కారణమట!
ప్రజలకు అందాల్సిన ప్రాథమిక ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా తక్షణమే పనితీరును మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు. అవుట్‌పేషెంట్ (ఓపీ) సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు గర్భిణుల ఆరోగ్య పరీక్షలు (ఏఎన్‌సీ), ఎన్‌సీడీ స్క్రీనింగ్, చికిత్సా సేవలను మెరుగుపరచాలనిసూచించారు. అదేవిధంగా యూపీహెచ్‌సీ పరిధిలోని పాఠశాలలతో సమన్వయం చేసుకుని హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులైన విద్యార్థులకు టీకాలు వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
Also Read: మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!