Komatireddy on BRS: బీఆర్ఎస్ కీలక నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నల్గొండలో మంగళవారం బీఆర్ఎస్ చేసిన ధర్నాపై తొలుత నోరు విప్పారు. ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ అక్కడికి వచ్చారని ప్రశ్నించారు. పదేళ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించారన్నారు. మంత్రులుగా ఉండి ఒక్కసారి కూడా జిల్లాకు రాలేదన్నారు. కేటీఆర్, హరీష్‌రావు తన కాలి గోటికి కూడా సరిపోరన్నారు.
కేసీఆర్ పేరు చెప్పుకుని మంత్రి అయ్యావని, తాను నీతి నిజాయితీకి మారు పేరని కుండబద్దలు కొట్టారు మంత్రి. కేటీఆర్‌పై పలు రకాల కేసులు ఉన్నాయని, తనపై ఒక్కటీ లేదన్నారు. ఉద్యమం సమయంలో మూడేళ్లు మంత్రి పదవిని వదులుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తనపై ఎలాంటి అవినీతి మరక లేదన్నారు.
ప్రతి పక్ష నాయకుడు 13 నెలలుగా అసెంబ్లీకి రాలేదన్నారు. అలాంటప్పుడు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు. మూసి ప్రక్షాళనను బీఆర్ఎస్ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నా రని సూటి ప్రశ్న వేశారు. తనపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కి లేదన్నారు. అతణ్ని బచ్చాగా వర్ణించారు. లక్షల కోట్లు, ఈ కార్ రేస్ అవినీతి తప్ప వాళ్ళ దగ్గరేమీ లేదన్నారు.
అమెరికాలో చదువుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను తిడితే వాళ్ళ తలకాయ పగిలి పోతాయన్నారు. మీకంటే జైలుకి వెళ్లిన లాలుప్రసాద్ బెటరన్నారు. కేసీఆర్ జైలుకి పోకుండానే ఒక్కసారి అసెంబ్లీకి రాలేదన్నారు. ఇక మామ చాటు అల్లుడు హరీష్‌రావు అని, తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.
ALSO READ: మేడిగడ్డ అదొక లోపాల పుట్ట.. తేల్చేసిన ఐఐటీ
గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారాయన. ఈ క్రమంలో ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణలో మూసీ చేయవద్దని కేంద్రమంత్రులు అంటున్నారని వివరించారు మంత్రి కోమటిరెడ్డి. ఢిల్లీలో అధికారంలోకి రాగానే యమున ప్రక్షాళన చేస్తామని బీజేపీ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. యమునా కంటే మూసీ డేంజర్‌లో ఉందన్న విషయం మీకు తెలీదా? అంటూ మండిపడ్డారు.
మూసీ కాలువ వెంట ఏసీ పెట్టుకుని గదుల్లో నిద్రపోయిన విషయం ఎవరికి తెలీదన్నారు. ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. తెలంగాణా ఉద్యమంలో గద్దర్ ఉన్నారని, బండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. అణగారిన ప్రజల కోసం గజ్జె కట్టి పాట పాడి ఉద్యమం చేసిన వ్యక్తి గద్దర్ అని గుర్తు చేశారు. ఆయనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ విధంగా మాట్లాడం కరెక్ట్ కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.