⦿ ఇండ్లు నిరంతర ప్రక్రియ
⦿ పేదలందరికీ ఇస్తాం
⦿ పార్టీ, కుల, మతాలకు అతీతం
⦿ ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు
⦿ 4 విడతలుగా చెల్లింపు
⦿ ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు
⦿ కష్టపడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చాం
⦿ అందరికీ న్యాయం చేస్తాం
⦿ ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు
⦿ త్వరలోని మరికొన్ని ఆచరణలోకి
⦿ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
హైదరాబాద్, స్వేచ్ఛ: Ponguleti Srinivas Reddy: పార్టీలు, కుల, మతాలకు అతీతంగా పేదవారందరికీ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండ్లు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని ఆయన ప్రకటించారు. ఒక్కో ఇంటి రూ.5 లక్షలు చొప్పున 4 విడతలుగా అందిస్తామని వెల్లడించారు. ఇంటిని అదనంగా పెంచి కట్టుకునేవారు కట్టుకొవచ్చని మంత్రి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లతో పాటు పాటు గిరిజన నియోజకవర్గాలకు ఇండ్లు ఇస్తామని ఆయన తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారంలో మంత్రి సీతక్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. కష్టపడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చామని పొంగులేటి వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క పేద వాడికి ఇల్లు రాలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు 25 లక్షల 65 వేల ఇండ్లు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ ఉన్న ప్పటికీ 63 వేల ఇండ్లు మాత్రమే ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో పేదవారికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
6 గ్యారెంటీలు పక్కా అమలు..
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని హామీలను అమలు చేశామని, మరికొన్నింటిని త్వరలోనే చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 7 లక్షల 19 వేల కోట్లు దోచుకొని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.6,500 కోట్లు వడ్డీలు చెల్లిస్తోందని అన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 67 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను రూ.185 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నామని ప్రకటించారు. ‘‘ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేద పిల్లలు చదువుకునే హాస్టళ్లలో విద్యార్థులకు మెస్‌చార్జీలు పెంచారా?, భవనాలు నిర్మించారా?’’ అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.
హామీలు ఇవ్వకుండానే పథకాలు
ఎన్నికల హామీలు కాకుండా ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్నామని ఆయన ప్రస్తావించారు. ఫామ్ హౌస్‌లో ఉంటూ అనుచరులను రెచ్చగొట్టి, ప్రజలపై ఉసిగొల్పుతున్నారని మంత్రి గుర్తుచేశారు. ‘‘మళ్ళీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహం పగలుగొడుతా అని కేసిఆర్ అంటున్నాడు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు. సోది కబుర్లు చెబుతున్నాడు. ఫామ్ హౌస్‌లో ఉంటూ కోట్లు ఎలా సంపాదించారో చెబితే తెలంగాణ రైతులు కూడా అదే విధంగా సాగు చేస్తారు కదా. అసెంబ్లీకి వచ్చి చెప్పు’’ అని కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. యూట్యూబ్ ఛానళ్లలో కాంగ్రెస్ పార్టీపై,
ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
కార్యకర్తలకే పెద్ద పీఠ: మంత్రి సీతక్క
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకే పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. పదవులు వచ్చాక ఇంట్లో కూర్చోవద్దని, 24 గంటలకు పని చేయాలని ఆమె సూచించారు. ‘‘ఆనాడు వైఎస్సార్ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారు. మళ్ల అదే చరిత్రను తిరగ రాసే శక్తి రేవంత్ రెడ్డికే ఉంది. రైతులను రాజులు చేస్తానంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ రైతులను అప్పుల పాలు చేశారు. ఆయన పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రైతులకు రుణమాఫీ కూడా చేయలేదు’’ అని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మరిపెడలో అమృత్ మంచినీటి సరఫరా కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మహిళా క్యాంటీన్ కేంద్రం, అంగన్ వాడీ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక కురవిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు.