Hyderabad : పక్కోళ్లను కూడా పట్టించుకోని రోజులివి. సాయం అడిగితే ఛీ పో అని చీదరించుకునే కాలమిది. మానవత్వం మచ్చుకైనా కానరాని కఠినాత్ముల లోకం ఇది. అలాంటిది.. నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి పడిపోతే ఎవరైనా పట్టించుకుంటారా? తమకు పని ఉందనో.. అప్పటికే ఆలస్యం అయిందనో.. చూసీచూడనట్టు వెళ్లిపోతుంటారు చాలామంది. ఎక్కడ పట్టించుకుంటే తమ మీదకు వస్తుందోనని.. హాస్పిటల్, పోలీసులు గట్రా రిస్క్ తమకెందుకని సైడ్ అయిపోతుంటారు. అయితే, అందరూ అలా ఉండరు. మనుషుల్లోనూ కొందరు మంచివాళ్లు, సాయపడే గుణం ఉండేవాళ్లు ఉన్నారు. అందులో, మంత్రి సీతక్క కూడా ఒకరు. ఇంతకీ అసలేం జరిగిందంటే…
ఫ్లైఓవర్‌పై వాహనదారుడికి ఫిట్స్
హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం పంజాగుట్ట. అక్కడి ఫ్లైఓవర్‌పై వాహనాలు ఒక్క క్షణం కూడా ఆగకుండా దూసుకుపోతుంటాయి. అలాంటి చోట.. ఫ్లైఓవర్‌పై ఓ వాహనదారుడు సడెన్‌గా పడిపోయాడు. ఎవరో ఏంటో తెలీదు. ఎందుకు పడిపోయాడో అర్థం కాలేదు. కొందరు చూస్తూ వెళ్లిపోయారు. మరికొందరు తమ వాహనాలను స్లో చేశారు. సరిగ్గా అదే సమయంలో మంత్రి సీతక్క అటుగా వెళ్తున్నారు. కిందపడిన వ్యక్తిని చూసి తన కారు ఆపారు. దగ్గరికి వెళ్లి చూస్తే.. అతనికి ఫిట్స్ వచ్చినట్టు గుర్తించారు.
తక్షణం స్పందించిన మంత్రి సీతక్క..
తక్షణం స్పందించారు మంత్రి సీతక్క. ఫిట్స్ వచ్చిన వ్యక్తి చేతిలో స్వయంగా తాళం చెవులు పెట్టారు. ఇనుము తగలడంతో బాధితుడి పరిస్థితి కాస్త కంట్రోల్‌లోకి వచ్చింది. అతను కోలుకునే వరకూ అక్కడే ఉండి పర్యవేక్షించారు మంత్రి సీతక్క. ఆ వాహనదారుడు లేచి కూర్చున్నాక.. ధైర్యం చెప్పి.. ఆసుపత్రికి పంపించారు. మంత్రి సీతక్క చూపిన చొరవను అంతా అభినందిస్తున్నారు. తాను మంత్రిని, బిజీగా ఉన్నా అని చూసీచూడనట్టు వదిలేసి వెళ్లిపోకుండా.. ఎవరో తెలీని వ్యక్తి కోసం.. ఫ్లైఓవర్‌పై కారు దిగొచ్చి సాయం చేసిన తీరుకు శెభాష్ అనాల్సిందే.
సీతక్క సేవలు సూపర్
మంత్రి సీతక్క ఇలాంటి విషయాల్లో అందరికంటే చాలా ముందుంటారు. తన సొంత జిల్లా ములుగులో సీతక్క సేవలు ఎవరూ మర్చిపోలేరు. భారీ వానలు కురిసి గ్రామాలు నీట మునిగినప్పుడు.. వరదలో, బురదలో దిగి.. స్వయంగా బాధితులకు రేషన్ సరుకులు అందించిన విషయం చూసే ఉంటారు. కరోనా టైమ్‌లోనూ సీతక్క సేవలు మరవలేనివి. తన ప్రాంతంలో ప్రతీ కుటుంబానికి నిత్యావసరాలు అందించిన ఘనత ఆమెదే. ఇలా చెప్పుకుంటూ పోతే.. సీతక్క సాయం ఎనలేనిది. సోషల్ మీడియాలో చెక్ చేస్తే.. చాలా వీడియోలే కనిపిస్తాయి. సీతక్క గొప్పతనాన్ని చూపిస్తాయి.