Miss World Contestants: మహబూబ్‌నగర్ జిల్లా పాలమూరు ఐకాన్ పిల్లలమర్రి కొత్త శోభ సంతరించుకుంది. మిస్ వరల్డ్ పోటీదారులకు వెల్కమ్ చెప్పేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అందగత్తెల రాకతో పిల్లలమర్రికి ప్రపంచ స్థాయి గుర్తింపు రానుంది.
22 దేశాల అందగత్తెల కోసం ఊడల మర్రిని పునరుజ్జీవనం చేసారు అధికారులు. చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా, వీక్షించేందుకు అనువుగా ఫుట్ ఓవర్ ఏర్పాటు చేశారు. సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షం చరిత్రను పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు.
ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకోనున్నారు అందగత్తెలు. పిల్లలమర్రి వద్ద తెలంగాణ సంసృతి ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలు సంప్రదాయాలతో స్వాగతం పలకనున్నారు. రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకోనున్నారు. తరువాత పురావస్తు శాఖ మ్యూజియంను సందర్శించనున్నారు. మ్యూజియం విశేషాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రత్యేక గైడ్లను సైతం నియమించారు.
అందాల భామల కోసం, చేనేత నేతల కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేలా స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక స్టాల్‌లో ప్రఖ్యాతి గాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించనున్నారు. మగ్గాలతో సహజ సిద్ధంగా నేసే చీరలను, హస్త కళా నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. అనంతరం అందగత్తెలు మొక్కలు నాటి, గురుకుల విద్యార్థులతో ముచ్చటించనున్నారు.
భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి టూరిజం పార్క్ దగ్గర పర్యటించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. స్థానిక చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరల ప్రాముఖ్యత, వాటి తయారీ విధానాన్ని చేనేత కార్మికులు అందగత్తెలకు వివరించారు. అనంతరం ఇక్కత్ పట్టు చీరలతో కంటెస్టెంట్స్ ఫ్యాషన్ షో నిర్వహించారు.
సుందరీమణుల పర్యటన నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. రేపు మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రిని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. సుందరీమణుల రాక కోసం జిల్లాలో మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు వెయ్యి మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎస్పీ జానకి తెలిపారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నారు.
Also Read: మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్.. మరింత క్లారిటీ ఇస్తా
ఇదిలా ఉంటే.. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో పొలిటికల్ వార్‌కు దారి తీశాయి. రామప్ప ఆలయంలో విదేశీ సుందరాంగులకు తెలంగాణ మహిళలతో కాళ్లు కడిగించారని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని విదేశీయుల దగ్గర తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ మహిళ నేతల ఆరోపణ.
తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ఓరుగల్లు హెరిటేజ్ టూర్ సక్సెస్ కావడంతో ప్రతిపక్షాలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క. ఈవెంట్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోని ఓ మహిళ.. కంటెస్టెంట్స్ కాళ్లపై నీళ్లు పోస్తే ప్రభుత్వాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారని ప్రశ్నించారు సీతక్క. మహిళల ఆత్మగౌరవం పేరుతో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.