Srinivas Reddy on KTR: అయ్యా కేటీఆర్.. ఎందుకు నవ్వుల పాలవుతున్నావు. ఎక్కడైనా ఓనర్ లేకుండా ఇంటికి బంధువులను ఆహ్వానిస్తారా.. మేమెప్పుడూ అలా చేయలేదు. మీ బావమరిది బ్యాక్ గ్రౌండ్ తెలుసు కాబట్టే భయపడుతున్నావా.. మా దావత్ లలో డ్రగ్స్ ఉండదు.. మీ ఫ్యామిలీ ఫంక్షన్ లలో డ్రగ్స్ కి చోటు ఉందా అంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ లోని జన్వాడా లో పోలీసుల నిర్వహించిన మెరుపుదాడులకు సంబంధించిన కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఏ2గా ఉన్న విషయం కూడా అందరికి తెలిసిందే. దీనితో నిన్న కేటీఆర్ స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. అయితే తనదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్ చేస్తూ.. ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా రేవ్ పార్టీ అనే మాట ఉచ్చరించలేదని, కేవలం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కాంగ్రెస్ ను ఉద్దేశించి ఆరోపించడం తగదన్నారు. దసరా దీపావళి సమయాలలో తెలంగాణ సంస్కృతి ప్రకారం దావత్ ఇవ్వడం సహజమని, ఈ విషయంలో తాను కేటీఆర్ కు మద్దతునిస్తానన్నారు. అయితే తన బావమరిది రాజ్ పాకాల గృహప్రవేశం సందర్భంగా పార్టీ ఇచ్చినట్లు తెలిపిన కేటీఆర్, ఒక విషయాన్ని మరిచిపోయారన్నారు. ఇంటి యజమాని లేకుండా గృహప్రవేశం చేస్తారా? అలాగే గృహప్రవేశాల సమయంలో డ్రగ్స్ వినియోగించడం సర్వసాధారణమేనా అంటూ కేటీఆర్ ను ఎమ్మెల్యే ప్రశ్నించారు.
రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసులతో ఉన్న సంబంధాల కారణంగానే పోలీసులు వారి నివాసాలలో కూడా తనిఖీలు నిర్వహించారని, నేటికీ బంజారాహిల్స్ వద్ద డ్రగ్స్ గ్యాంగ్ ఎవరని, ఎవరిని ప్రశ్నించినా తెలుస్తుందన్నారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ.. పురుషులు, మహిళలు అంటూ విడదీసి చెబుతున్నారని, ఎక్కడైనా పంచనామా నిర్వహించిన సమయంలో అలాగే నమోదు చేస్తారన్న విషయాన్ని కూడా కేటీఆర్ గ్రహించలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ విషయంలో వారెంట్ అడగాలో తెలియని కేటీఆర్, విదేశాల్లో ఏమి చదువుకున్నారని, ఎన్డీపీఎస్ కేసులలో వారెంట్ లేకుండా సర్చ్ చేయవచ్చన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలన్నారు.
ఓనర్ లేకుండా గృహప్రవేశం చేసుకోవడం విడ్డూరంగా ఉందని, పోలీసులు వచ్చిన సమయంలో డ్రగ్స్ విషయం బయట పడుతుందనే రాజ్ పాకాల అక్కడి నుండి పరారైనట్లు భావిస్తున్నానన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, కక్షపూరిత రాజకీయాల సాంప్రదాయం పదేళ్లు సాగిందని, ఇది మీ స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది కాదంటూ ఎమ్మెల్యే విమర్శించారు. రాజ్ పాకాల తప్పు చేయని పక్షంలో నేరుగా మీడియా ముందుకు వచ్చి, తనపై ఆరోపణలు చేయడం తగదని వివరణ ఇచ్చి ఉంటే, నేడు కేటీఆర్ మాటలను ప్రజలు కొంతైనా విశ్వసించే వారన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ మాట్లాడే సమయంలో సరైన అవగాహన ఉండి మాట్లాడాలని ఎమ్మెల్యే సూచించారు.