Kavitha : ఎమ్మెల్సీ కవిత తన ఇంటి పక్కనే.. కొత్తగా జాగృతి ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ ఉన్నారు. బ్లూ కలర్ సారీ, మెడలో పసుపు పూసల జపమాలతో కనిపించారు కవిత. ఎక్కడా BRS ఆనవాళ్లు లేకుండా కవిత జాగ్రత్త పడ్డారు. జాగృతి ఆఫీసులో కేసీఆర్ ఫొటోతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం, అంబేద్కర్, మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు పెట్టారు. జాగృతి బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్‌లో కూడా కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోలు మాత్రమే కనిపించాయి.
విల్ నెవర్ ఫియర్..
కవిత ఇంటి దగ్గర సైతం కొత్త ఫ్లెక్సీలు వెలిశాయి. గులాబీ రంగు జెండాలు ఫ్లెక్సీకి బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్నాయి. “డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్” అంటూ ఫ్లెక్సీలపై కొటేషన్లు కనిపించాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా.. తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం కండువాలో కవిత ఉన్నట్టు ఫ్లెక్సీలు తయారుచేయించారు.
ఆ విగ్రహమే పెట్టావేంటి కవితక్కా?
జాగృతి ఆఫీసులో విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందులో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన పాత విగ్రహాన్నే కవిత తన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే, ఆ తెలంగాణ తల్లి రూపును ఇప్పటికే మార్చేసింది ప్రభుత్వం. కిరీటం లేకుండా అచ్చమైన తెలంగాణ మహిళ ఆకారంలో కొత్త విగ్రహం ఆవిష్కరించారు సీఎం రేవంత్‌రెడ్డి. కానీ, కవిత మాత్రం పాత విగ్రహాన్నే కొత్తగా తన ఆఫీసులో పెట్టుకోవడంపై చర్చ నడుస్తోంది. అప్పటి తెలంగాణ తల్లి.. కవిత రూపురేఖలతో ఉండేదని.. ఆమె పోలికలే ఉండేలా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని తయారు చేయించిందనే ఆరోపణ ఉంది. చూట్టానికి తనలానే ఉంటుంది కాబట్టే.. మళ్లీ ఆ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్నే మళ్లీ ఏర్పాటు చేశారా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.