Kavitha: బీజేపీ టార్గెట్‌గా ఎమ్మెల్సీ కవిత పావులు కదుపుతున్నారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీతో విలీనం అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. మంచిర్యాల జిల్లా వెళ్లిన ఆమె, మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. లేఖలో తాను ప్రస్తావించిన అంశాలు ప్రజలు అనుకున్నవేనని అన్నారు. ఈ విషయంలో తనకు ప్రత్యేక ఎజెండా ఏమీ లేదన్నారు.
కనీసం బీజేపీ వైపు చూడొద్దని తేల్చిచెప్పేశారు కవిత. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదని వ్యాఖ్యానించారు. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో పార్టీని చేస్తామని చెప్పారన్నారు. ఆ పార్టీతో విలీనానికి తాను అంగీకరించలేదన్నారు. తాను లెటర్ రాయడంలో ఎలాంటి తప్పులేదని తేల్చేశారు.
తండ్రిని కలిసి చాలా విషయాలు చెప్పాలని ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చారు కవిత. తండ్రిని కలిసే అవకాశం వచ్చిందికానీ కలవలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువని, లెటర్ బయటికి తెచ్చిన వారిని పట్టుకోవాలన్నారు. ఈ విషయంలో పెద్దాయనను ఎవరేమన్నా ఊరుకునేది లేదన్నారు.
ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో లేఖ రాసినట్టు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు. కేసీఆర్ దయవల్ల సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కిందన్నారు.
ALSO READ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం? కుండబద్దలు కొట్టిన రఘునందన్!
యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశం కల్పించామన్నారు. అప్పట్లో తెలంగాణ బొగ్గు గని సంఘంలో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారని వెల్లడించారు. భాగ్యరెడ్డి వర్మ, పీవీ నరసింహరావు ముఖ్యనేతల వర్ధంతి కార్యక్రమాలను జాగృతి ఆద్వర్యంలో చేశామన్నారు.
కవిత పదే పదే విలీనంపై మాట్లాడడం వింటుంటే తెర వెనుక అన్ని ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో విలీనానికి ససేమిరా అంగీకరించేది లేదన్నారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడారు. అయినా కవిత మాత్రం విలీనంపై ప్రధానంగా ప్రస్తావించారు. ఈ వ్యవహరంపై పార్టీ హైకమాండ్‌తో ఆమె విభేదించినట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న కవిత సోదరుడు కేటీఆర్ పార్టీలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇదే ఎపిసోడ్ కంటిన్యూ అయితే కొద్దిరోజులు అక్కడ వుంటే బెటరనే ఆలోచనకు వచ్చినట్టు ఆయన మద్దతుదారుల మాట.