ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన మీడియా సంస్థపై జాగృతి కార్యకర్తల దాడి వ్యవహారం సంచలనంగా మారింది. ఈ దాడి అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం మరింత ఆసక్తికరం. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అంటున్న తీన్మార్ మల్లన్న, మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదన్నారాయన. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి జరిగిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు. బీసీలైతే ఏదైనా మాట్లాడొచ్చు అనుకోవడం సరికాదన్నారామె. పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు సహించబోరని చెప్పారు. మల్లన్న వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన తమ కార్యకర్తలు ఆఫీస్ వద్ద నిరసన తెలియజేయడం కోసం వెళ్లారని, అలా వెళ్లినంత మాత్రాన తుపాకీతో కాల్పులు జరుపుతారా అని ప్రశ్నించారు. అంత కక్ష ఎందుకని అన్నారు కవిత.
తెలంగాణ ప్రజలు పరుష పదజాలాన్ని సహించరు. మల్లన్న చేసిన వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు వెళ్లారు.
సామాన్యులపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఎందుకు? – ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/xpN6Ge6WCD
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) July 13, 2025
ఏఐజీకి మండలి ఛైర్మన్ కి ఫిర్యాదులు..
తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కవిత. జాగృతి కార్యకర్తలతో ఆమె డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ జాగృతి కార్యకర్తల పై కాల్పులకు ఉసిగొల్పారంటూ లా అండ్ ఆర్డర్ AIG రమణ కుమార్ కు ఆమె ఫిర్యాదు చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కూడా కవిత ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలు ఉపయోగించి మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/fbQCwJvSJc
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) July 13, 2025
మహిళలు రాజకీయాల్లోకి రాకూడదా..?
మల్లన్న తమపై చేసిన వ్యాఖ్యల్ని రిపీట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉందని, బోనం ఎత్తుకున్న ఆడబిడ్డలను అమ్మవారిలా చూసే సంస్కృతి మనది అని చెప్పారామె. ఇప్పుడిప్పుడే మహిళలు రాజకీయాల్లోకి వస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, అలాంటి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారామె. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. రాజకీయాల్లోకి వచ్చే మహిళలు వెనక్కి వెళ్తారని చెప్పారు. తెలంగాణలో ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావద్దా? అని ప్రశ్నించారు కవిత. ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై జాగృతి తరపున పోరాటం చేస్తున్నామని, తీన్మార్ మల్లన్నపై తానెప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు కవిత. అయితే ఉద్దేశపూర్వకంగానే తనపై ఆయన పరుష పదజాలంతో మాట్లాడారన్నారు.
బీసీల తరపున పోరాటం చేయడం, బీసీల సమస్యలపై సమావేశాలు పెట్టడం మంచిదే కానీ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీలను పట్టించుకోని కవిత, ఇప్పుడు కొత్తగా ఉద్యమాలంటూ తెరపైకి రావడం హాస్యాస్పదం అంటున్నారు నేతలు. ఇటీవల బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కవితపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు బీసీలకు, కవితకు ఏం సంబంధం అని నిలదీశారు. ఇటు తీన్మార్ మల్లన్న కూడా బీసీలతో కవితకు సంబంధమేంటని ప్రశ్నించారు. అయితే కంచం, మంచం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వెంటనే జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్ పై దాడి చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వ్యవహారంపై కనీసం బీఆర్ఎస్ నుంచి స్పందన లేకపోవడం విశేషం.