Sama Rammohan Reddy: తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు షురూ అయ్యింది. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అధికార పార్టీకి నాలుగు మాత్రమే దక్కనున్నాయి. మరొకటి బీఆర్ఎస్‌కు వెళ్లనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ గడువుకు కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది.
నేతల లాబీయింగ్
ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్‌తో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. శనివారం నాటికి ఎమ్మెల్సీ సీట్ల అభ్యర్థులపై ఓ ప్రకటన రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నాలుగు ఎమ్మెల్సీలు గెలిచే అవకాశం ఉండటంతో పార్టీలో ఆశావహుల తాకిడి పెరిగింది.
ఎమ్మెల్సీ సీటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, జట్టి కుసుమ కుమార్, కుమార్ రావు, వేణు గోపాల్ రావు, అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్, సునీతా రావు, సరితా యాదవ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు వీరంతా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ముందు రేసులో సామ
ఎమ్మెల్యే కోటాలో టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు దాదాపుగా కన్ఫార్మ్ అయినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. కార్యకర్త స్థాయి నుంచి టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా, పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన సేవలందిస్తున్నారు. అడ్వకేట్‌గా, మీడియా స్పోక్స్‌పర్సన్‌గా పార్టీకి తనవంతు సేవలు అందిస్తున్నారు.
ALSO READ: ఎనిమిది మంది కోసం రంగంలోకి క్యాడవర్ డాగ్స్
కాన్ఫిడెంట్‌గా చెబుతున్న మద్దతుదారులు
పార్టీ అధికారంలో రావడంలో సామకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని అంటున్నారు. టీవీ డిబేట్లలో బీఆర్ఎస్ నేతలను తన మాటలతో ఎండగట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్న సామకు ఎమ్మెల్సీ ఇస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన నాలుగు నేతలు రేసులో ఉన్నారు. అందరికంటే ముందు వరుసలో సామ రామ్మోహన్‌రెడ్డి ఉన్నారు. తమ నాయకుడు దాదాపుగా టికెట్ ఖాయమైందని, అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని ఆయన మద్దతుదారులు బలంగా చెబుతున్నారు.