SLBC Tunnel Updates: SLBCలో సహాయక చర్యలు 14వ రోజుకి చేరాయి. రెస్క్యూ ఆపరేషన్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. టన్నెల్‌లో లోపల చిక్కుకుపోయిన వారి ఆనవాళ్లు గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ రంగంలో దిగాయి. ఈ ఉదయమే డాగ్స్ టీం టన్నెల్ లోకి వెళ్ళింది. వీటితో పాటు 110 మంది రెస్క్యూ బృందంతో లోకో మోటర్ కూడా టన్నెల్ లోకి వెళ్ళింది. ఆపరేషన్‌కు అవసరమైన సామాగ్రిని లోకో ట్రైన్ లోపలికి తీసుకువెళ్లింది. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్‌ను డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా,NDRF అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్ పరిశీలిస్తున్నారు.
బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్‌కు చెందిన క్యాడవర్ డాగ్స్..15 అడుగుల లోపల ఉన్న మృతదేహాలను కూడా గుర్తించగలవు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు సహాయక బృందాలు టన్నెల్ నుండి తిరిగి రానున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కలక్టర్ సంతోష్ బాదావత్.. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మరోసారి టన్నెల్‌లోకి రోబోటిక్ టీమ్ వెళ్లింది. ఈ బృందం వెంట మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ కూడా వెళ్లారు. టన్నెల్‌లోని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. రోబోలను తెప్పించి సహాయక చర్యలకు ఉన్న అనువైన పరిస్థితులనపై పరిశీలిస్తున్నారు. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ టన్నెల్ లోపలికి వెళ్లాయి. చిక్కుకున్న వారి కోసం క్యాడవర్ డాగ్స్‌తో తనిఖీ చేస్తున్నారు.
SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు స్పీడ్ అందుకున్నాయ్. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో టన్నెల్ లోపల నుంచి మట్టి, బురద తొలగింపు వేగంగా కొనసాగుతోంది. నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తం 6 వేల క్యూబిట్ మీటర్ల పూడిక ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే TBM మిషన్ కటింగ్ తుది దశకు చేరుకుంది. మిషన్ భాగాలను వెంట వెంటనే బయటకు తీసుకొస్తున్నారు.
సొరంగం కూలిన సమయంలో పడిపోయిన సిమెంటు సెగ్మెంట్లు కూడా సహాయ చర్యలకు అడ్డుగా మారాయి. ఈ సెగ్మెంట్లు, టీబీఎంను తొలగిస్తే సొరంగంలోకి జేసీబీలను పంపించి మట్టిని తోడిస్తారు. 12 రోజులు అవుతున్నా కార్మికుల జాడ తెలియలేదు. నిన్న మరోసారి జాగిలంతో అన్వేషించినా ఫలితం లేదు. కార్మికులు ఉన్నారని భావిస్తున్న చోట ఆరు మీటర్ల ఎత్తున మట్టి పేరుపోయింది. దీంతో వారిని గుర్తించడం జాగిలానికి కూడా కుదరడం లేదు. GPR సాయంతో 5 అనుమానిత ప్రదేశాలను గుర్తించి తవ్వకాలు చేపట్టాయి. రెండుచోట్ల కార్మికుల జాడ లేదు. మిగిలిన 3 చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి.
Also Read: నీటిని వృధా చేస్తున్నారా? అయితే మీకు ఫైన్ల మోత మోగాల్సిందే?
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్.. అక్కడ జరుగుతున్న పనులు పర్యవేక్షించారు. రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్.. టన్నెల్‌లోని ప్రస్తుత పరిస్ధితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. టన్నెల్ లోపల 13.650 కిలోమీటర్ల ప్రాంతంలో టన్నెల్ బోర్ మిషన్‌పై రాళ్లు, మట్టి పడి.. 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్ బోర్ మిషన్ ధ్వంసం అయ్యిందని తెలిపారు. అందులోనే ఎనిమిది మంది ఇరుక్కుపోయినట్లు వివరించారు.
నీరు రావడం, మట్టి, రాళ్లతో కలిసిపోయిందని.. ప్రస్తుతం TBMను కొద్దికొద్దిగా కట్ చేస్తూ.. కార్మికులను అన్వేషిస్తున్నట్లు వివరించారు. వారి గుర్తింపు కోసం కేరళ నుండి క్యాడవర్ డాగ్స్‌ను రప్పించినట్లు వివరించారు. కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయడం ప్రారంభమైందన్నారు. మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తీయించే ప్రక్రియ మొదలైతే సహాయక చర్యలు వేగవంతం అవుతాయని అధికారులు చెబుతున్నారు.