MLC Vijayashanti Life Threat| ప్రముఖ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కు చంపేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపు మెయిల్స్ పంపాడు. ఈ నేపథ్యంలో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. విజయశాంతి భర్త శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లలో “నరకం ఏంటో చూపిస్తాను” అంటూ చంద్రశేఖర్ వారిని భయపెట్టాడని వారు ఫిర్యాదులో తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి శ్రీనివాస్ ప్రసాద్‌కు పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పి.. రాజకీయంగా మంచి పబ్లిసిటీ చేస్తానని వారికి తెలియజేశాడు. దీంతో, చంద్రకిరణ్ ను తమ సోషల్ మీడియా అకౌంట్లలో కంటెంట్ క్రియేటర్ గా నియమించుకున్నారు. అయితే అతని పనితీరును పరిశీలించిన తర్వాత కాంట్రాక్ట్ చేసుకుందామని శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు. అయితే చంద్రకిరణ్ తగిన స్థాయిలో పనిచేయకపోవడమే కాక, విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సమయంలో చంద్రశేఖర్ పని తీరుతో వారు నిరాశ చెంది, ఎటువంటి ఒప్పందం లేకుండానే అతడిని ఆఫీసు నుంచి తొలగించారు.
ఈ నేపథ్యంలో.. ఇటీవల శ్రీనివాస్ ప్రసాద్‌కు చంద్రకిరణ్ ఫోన్ చేసి తనకు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు. ఏ ఒప్పందం లేకుండా డబ్బులు అడగడంతో శ్రీనివాస్ ప్రసాద్ ఆశ్చర్యపోయారు. చంద్రశేఖర్ తనకు రావలసిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో, శ్రీనివాస్ ప్రసాద్ అతడిని ఆఫీసుకు వచ్చి మాట్లాడాలని సూచించారు. కానీ చంద్రకిరణ్ ఆఫీసుకు రాకుండా.. మెయిల్స్, మెసేజ్‌ల ద్వారా బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వకపోతే విజయశాంతిని (Actress Vijayashanti) , శ్రీనివాస్‌ను హత్య చేస్తానని హెచ్చరించాడు. అంతేకాకుండా, వారి కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వారి పరువు తీస్తానంటూ బెదిరించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో.. విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: హైదరాబాద్ యువతకు గుడ్ న్యూస్.. యూకేలో చదవాలనుకునే వారికి కొత్త అవకాశాలు
మరోవైపు విజయశాంతి త్వరలో హీరో కళ్యాణ్ రామ్ సినిమా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా బృందంతో ఆమె ఇటీవల తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో నటుడు నందమూరి కల్యాణ్ రామ్, నటి విజయశాంతి, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుందని చెప్పారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులతో కలిసి చూడాలని కోరారు. ఈ చిత్రంలో విజయశాంతి తల్లి పాత్రలో, కల్యాణ్ రామ్ కుమారుడిగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది.