Modi Tour : ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణలో పర్యటించనున్నారు. మోదీ శనివారం మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. అక్కడే బీజేపీ ముఖ్య నేతలతో మోదీ కాసేపు మాట్లాడతారు. తర్వాత 2.15 గంటలకు ఎంఐ–17 హెలీకాప్టర్‌లో రామగుండం బయలుదేరి వెళ్తారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సోమాజిగూడా,రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గాల్లో రావద్దని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
మోదీ మధ్యాహ్నం 3.30కు రామగుండంలో ఎరువుల పరిశ్రమను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15కి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో మోదీ మాట్లాడతారు. ప్రధాని కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరుకారని ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేసీఆర్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉండటం సరికాదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఏపీ, తమిళనాడులో పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీ పర్యటనను ఆహ్వానిస్తుంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు స్వాగతించడం లేదని విమర్శించారు. రాజకీయాలు, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను సీఎం గుర్తించడం లేదని మండిపడ్డారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేసీఆర్ హాజరవ్వాలని లక్ష్మణ్ సూచించారు.