Modi : ప్రధాని మోదీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటిస్తారు. రూ.6,120 కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. భారీగా జన సమీకరణ చేసేందుకు సన్నద్ధమవుతోంది. లక్షమంది బహిరంగసభలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు, ఈటల రాజేందర్, జి.వివేక్ పాల్గొన్నారు.
ప్రధానికి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. ప్రధాని సభకు రైతులు,కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చేలా చూడాలని నిర్దేశించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ద్వారా తెలంగాణ, ఏపీతోపాటు దక్షిణ భారత రైతులందరికీ కొరత లేకుండా ఎరువులను సరఫరా చేయబోతున్న విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. మరి రామగుండ బహిరంగ సభలో మోదీ ఏం మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరి టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు రామగుండ వేదికగా మోదీ కౌంటర్ ఇస్తారో ? లేదో వేచి చూడాలి.