Moinabad Drugs Case: స్వేచ్ఛ బ్యూరో: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దాడి జరిపినపుడు స్వాధీనం చేసుకున్న కొకైన్ సిమ్లా నుంచి తెచ్చింది కాదని.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అభిషేక్ నుంచి కొన్నదని వెల్లడి కావటం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే కోర్టు అనుమతితో పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీశ్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి తీసుకుని దీనిపై క్షుణ్నంగా విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే వారం రోజులపాటు ముగ్గురిని కస్టడీకి అనుమతించాలంటూ ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై ఈనెల 20న కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. పక్కాగా వచ్చిన సమాచారం మేరకు ఇటీవల ఈగల్ ఫోర్స్ అధికారులు ఫ్యూచర్ సిటీ ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులతో కలిసి మొయినాబాద్‌లో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫార్మ్ హౌస్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. మొత్తం 11మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు డ్రగ్ టెస్టులు జరుపగా ఆరుగురికి పాజిటీవ్ అని వచ్చింది. వీరిలో పైలట్ రోహిత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, నమిత్ శర్మ, రితీశ్ రెడ్డి, కౌశిక్, అర్జున్ రెడ్డిలు ఉన్నారు. ఇక, ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ తోపాటు మరో ఏడుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితీశ్ రెడ్డిలను జైలుకు రిమాండ్ చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం చేవెళ్ల జోన్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో మంగళవారం సిట్ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారులు స్టేషన్ బెయిల్ పై విడుదలైన ఏడుగురిని మంగళవారం రాత్రి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు.
Also Read: Minister Ponnam Prabhakar: ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై సపోర్ట్ చేస్తున్నారా?.. వ్యతిరేకిస్తున్నారా?
ఈ విచారణలో కీలక వివరాలు వెలుగు చూసినట్టు సమాచారం. మొదటి రోజు పట్టుబడినపుడు కొకైన్ ను సిమ్లా నుంచి కొని ఇక్కడికి తెచ్చినట్టు నిందితులు చెప్పారు. అయితే, దీంట్లో నిజం లేదని సిట్ దర్యాప్తులో స్పష్టమైనట్టు తెలిసింది. పైలట్ రోహిత్ రెడ్డి వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న సిల్వేరు శరత్ కుమార్ ను ప్రశ్నించినపుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అభిషేక్ సింగ్ నుంచి కొకైన్ ను ఔటర్ రింగు రోడ్డు వద్ద కొన్నట్టు చెప్పాడని తెలియవచ్చింది. దీనిపై ఆరా తీయగా అభిషేక్ సింగ్ డ్రగ్ పెడ్లర్ అని వెల్లడైనట్టు తెలిసింది. గోవా, బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ పెడ్లర్లతో అతనికి సంబంధాలు ఉన్నట్టుగా తెలియవచ్చినట్టు సమాచారం. గతంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో అతను నిందితునిగా ఉన్నట్టు తేలిందని తెలియవచ్చింది. ఈ క్రమంలో అభిషేక్ సింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఓ అధికారితో మాట్లాడగా అభిషేక్ సింగ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ రాకెట్ మూలాలు బయట పడే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండటం ఖాయమన్నారు.
ఇక, అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి, రితీశ్ రెడ్డి, నమిత్ శర్మలను వారం రోజులపాటు కస్టడీకి అనుమతించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం దీనిపై వాదనలు జరిగాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో మరింత లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు. డ్రగ్స్ ఎవరెవరి నుంచి కొన్నారు? ఎన్నిసార్లు కొన్నారు? ఎన్నిసార్లు పార్టీలు చేసుకున్నారు? వీటిల్లో ఎవరెవరు పాల్గొన్నారు? అన్న సమాచారాన్ని సేకరించాల్సి ఉందన్నారు. అయితే, నిందితుల తరపు న్యాయవాదులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 20వ తేదీకి రిజర్వ్ చేసింది.
Also Read: Rajya Sabha: రాజ్యసభ సీట్ల కేటాయింపులపై విభేదాలు.. గుర్రుమంటున్న సీనియర్లు