Kidnap Case in HYD : హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చిన్న పిల్లాడి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. మగపిల్లాడు కావాలని కోరికతో ఓ మహిళ నెల రోజుల చిన్నారిని అపహరించింది. బాలుడి కిడ్నాప్ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు.. పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నాప్ వ్యవహారం తెలిసిన వెంటనే ఆసుపత్రి పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు.. 5 గంటల వ్యవధిలోనే బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం.. హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రిలో ప్రసవం అయ్యింది. మగపిల్లాడు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన సందర్భంలో కిడ్నాప్ కి గురయ్యాడు. బాబుని కాసేపు ఎత్తుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకున్న ఓ మహిళ.. అటు నుంచి అటే పరారైంది. బాలుడిని ఎత్తుకున్న మహిళ కనిపించకపోవడంతో కిడ్నాప్ చేశారని గుర్తించిన బాధితులు.. నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు.
చిన్నారి బాలుడి కిడ్నాప్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. వేగంగా స్పందించారు. అసుపత్రితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి.. కిడ్నాప్ అయిన బాలుడి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నిలోఫర్ ఆసుపత్రి నుంచి బురఖా ధరించిన ఓ మహిళ కిడ్నాప్ చేసిన బాలుడుతో పాటుగా ఆటో ఎక్కినట్టుగా సీసీ టీవీ పుటేజ్ లో గుర్తించారు. కిడ్నాప్ చేసిన మహిళ.. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ దగ్గర దిగినట్లు గుర్తించారు. అక్కడే ఆమె కోసం మరో వ్యక్తి ఎదురుచూస్తుండగా.. ఆ బండిపై ఇద్దరు కలిసి వెళ్లిపోయారు.
మహిళ బురఖాలో ఉండడంతో మొహాన్ని గుర్తించలేకపోయారు. కిడ్నాప్ చేసిన మహిళ ఆటో దిగిన తర్వాత ఎక్కిన బండి ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. స్కూటీ నంబర్ ప్లేట్ ద్వారా వాహనదారుడి వివరాలు సేకరించిన పోలీసులు.. అది ఎటువెళుతుందోనని ట్రాక్ చేశారు. ఆ వాహనం కర్నూలు వైపు వెళుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు.. గద్వాల్ పోలీసుల సహకారంతో పొన్నూరు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాహనంపై వెళ్తున్న మహిళలను మరో వ్యక్తిని అరెస్ట్ చేసి.. కిడ్నాప్ అయిన బాలుడిని కాపాడారు.
గంటల వ్యవధిలోనే బాలుడిని కాపాడిన పోలీసులు.. కిడ్నాపర్ల చెర నుంచి రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. నిందుతురాలు షహీన్ బేగంగా గుర్తించారు. ఈమె.. తన అక్క రేష్మ అనే మహిళ కోసమే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఈమె అక్కకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు కాగా.. మగపిల్లాడి కోసం అత్తగారింట్లో గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నాలుగో కాన్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరోమారు ఆడపిల్ల పుటితే తన అక్క కాపురం చెడిపోతుందనే భయంతో.. మగపిల్లాడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నెల వయస్సున్న చిన్నపిల్లని కిడ్నాప్ చేసిన కేసులో షాహిన్ బేగంతో పాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండకు తరలించారు.
నీలోఫర్ ఆసుపత్రికి వచ్చే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించిన పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు. మాయమాటల్లో దింపి.. పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్లుంటారని పిల్లల్ని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలని కోరుతున్నారు. ఆసుపత్రిలో ఎవరిపైనైనా అనుమానం వస్తే.. వెంటనే తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.