Nalgonda District News: ఈ గ్రామంలో మద్యం మత్తులో ఉంటే మాత్రం మత్తు దిగడం ఖాయం. అలాగే మద్యం సేవించిన వ్యక్తి జేబుకు తప్పక చిల్లు పడుతుంది. మరొకరి ఇంట్లో మాత్రం పండగే. ఔను మీరు విన్నది నిజమే. ఈ గ్రామంలో ఉన్న కట్టుబాటు చూసి అందరూ ఔరా అనేస్తున్నారు. ఇక్కడ మద్యం సేవించిన వ్యక్తిని పట్టిస్తే వారికి అదిరిపోయే గిఫ్ట్ కూడ ఇస్తారు. ఇంత మంచి కట్టుబాటు ఉన్న గ్రామం తెలంగాణలోనే ఉంది. ఇటీవల ఆ గ్రామంలో ఉన్న నియమ నిబంధనలు చూసి, పక్క గ్రామాలు కూడ అదే దారిలో నడిచేందుకు సిద్దమవుతున్నాయట. అదే జరిగితే మందుబాబులకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఆ గ్రామమేది? ఆ నిబంధనలేమిటో తెలుసుకుందాం.
నల్గొండ జిల్లా ఏపూరు గ్రామం ఇప్పుడు ఆదర్శ గ్రామంగా పిలువబడుతోంది. ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల మద్యం సేవించి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ఇంటికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు. ఇలాంటి పరిస్థితి గ్రామంలోని ఏ కుటుంబానికి రాకూడదన్న అభిప్రాయంతో ఊరంతా ఏకమైంది. తమ గ్రామ ప్రజల కోసం కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చారు. ఈ నిబంధన ప్రకారం గ్రామంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే ఎవరైనా గ్రామంలో మద్యం అమ్మినా, త్రాగినా కఠి (న చర్యలు ఉండేలా నిర్ణయించారు.
గ్రామ నిబంధన ఇదే..
ఎవరైనా మద్యం త్రాగినట్లు తెలిస్తే చాలు.. తమకు సమాచారం ఇవ్వాలని మహిళా సంఘం నేతలు ప్రకటించారు. అంతేకాదు మద్యం త్రాగిన వారిని పట్టించిన వారికి రూ. 10 వేలు నజరానా ఇస్తామంటున్నారు. అందుకే గ్రామంలో ఎవరైనా మద్యం చిక్కి పట్టుబడతారా అంటూ.. ఓ రేంజ్ లో భూతద్దం వేసి వెతుకుతున్నారట అక్కడి ప్రజలు. ఇలా ఇచ్చే రూ. 10 వేలు ఏదో గ్రామ కమిటీ నుండి ఇస్తారని మాత్రం అనుకోవద్దు. ఏపూరులో మద్యం విక్రయిస్తే రూ. 1,00,000 , త్రాగి పట్టుబడితే రూ. 20 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. పట్టుబడిన వ్యక్తి నుండి వసూలు చేసిన నగదులో సగం పట్టించిన వారికి అందజేస్తారు.
Also Read: Bird Flu In Eluru: ఏలూరులో వ్యక్తికి బర్డ్ ఫ్లూ.. కలెక్టర్ ఏం చెప్పారంటే?
తమ గ్రామ ప్రజల రక్షణ కోసమే నిర్ణయం తీసుకున్నామని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా పిలువబడుతుండడం ఆనందంగా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఏపూరు గ్రామ నిబంధన గురించి తెలుసుకున్న, ఇతర గ్రామస్తులు కూడ ఇదే నిబంధన అమలు చేసే దిశలో ఉన్నారట. నేటి రోజుల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను గమనిస్తే, అందులో 50 శాతం మద్యం మత్తు కారణమేనని చెప్పవచ్చు. ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నా, ఫలితం అంతంత మాత్రమే. ఇలా అన్ని గ్రామాలు చైతన్యం చెందితే, ప్రజల ఆరోగ్యాలతో పాటు, ప్రాణాలు కూడ రక్షింపబడతాయని ప్రజలు తెలుపుతున్నారు. మొత్తం మీద ఈ గ్రామంలో మద్యం త్రాగి కనిపిస్తే.. ఏకంగా రూ. 20 వేలు ఇవ్వాల్సిందే. తస్మాత్ జాగ్రత్త సుమా.. మద్యం త్రాగి ఏపూరు వైపు వెళ్లొద్దు సుమా!