Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ పోరులో.. ప్రధాన పార్టీల నుంచి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా ఇద్దరి నుంచి నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం నల్గొండ కార్పొరేషన్ మినహా అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని మిర్యాలగూడ(Miryalaguda), హాలియా(halia), నందికొండ(Nandhikonda), దేవరకొండ(Dhevarakonda), చండూరు(Chanduru), చిట్యాల(Chityala) మున్సిపాలిటీల పరిధిలో పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పార్టీ అధినాయకత్వం నిమగ్నమైంది. ఈనెల 3వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ వేసిన అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. బీఆర్ ఎస్ పార్టీ మిర్యాలగూడలో సీపీఎంతో పొత్తు పెట్టుకుని అభ్యర్థులను ఖరారు చేసి ఇప్పటికే ప్రచారం షురూ చేసింది. బీఆర్‌ఎస్ ఆశావాహులతో ఇప్పటికే చర్చలు జరిపి అధికార పక్షానికి దీటుగా మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ గా భావిస్తున్న అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునేలా కీలక నేతలు మంతనాలు జరుపుతున్నారు.
నల్గొండ జిల్లా నల్గొండ కార్పొరేషన్ సహా ఆరు మున్సిపాలిటీల పరిధిలో స్వతంత్రులు, ఇతర రిజిస్ట్రేషన్ పార్టీలతోపాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి మొత్తం 162 స్థానాలకు 1750 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వేసిన 631 నామినేషన్లలో మిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా 213 నామినేషన్స్ ఉన్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ 475, బీజేపీ 286 నామినేషన్లు వేశారు. మొత్తం ప్రధాన పార్టీల నుంచి 1392 నామినేషన్లు దాఖలయ్యాయి.
జిల్లాలో ఎక్కడ లేని విధంగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠగా మారింది. మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని ప్రధాన నాయకత్వం రంగంలోకి దిగి అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం 10 గంటల లోపు ఆశావాహులకు ప్రత్యామ్నాయ పదవులకు హామీ ఇస్తూ అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్ ఆధ్వర్యంలో నామినేషన్ వేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి సహా ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్ ఇతర ముఖ్య నేతల సూచనల మేరకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సొంత పార్టీ నేతలను కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యుల నుంచి నామినేషన్లు వేయించారన్న ప్రచారం కొనసాగుతోంది.
Also Read: MP Raghunandan Rao: ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..?
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 11చోట్ల ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని మిర్యాలగూడ నుంచే ప్రారంభించటం మున్సిపల్ పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి తొలి ప్రచార సభ మిర్యాలగూడ నుంచే మొదలుకానున్న నేపథ్యంలో సొంత పార్టీలో అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికలపై సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సమీక్ష చేపట్టారు. సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు. తనతో పాటు ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో 48 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఆయా వార్డుల నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులతో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు లీడర్లు పాల్గొన్నారు.