Congress vs BRS Party: పదేళ్లు అధికారంలో ఉన్నారు. రైతు అనే మాట ఎత్తితే, పోలీసుల ఆంక్షలతో ఎక్కడికక్కడ అణగతొక్కారు. నిరసనలు తెలిపే హక్కును కూడ కాలరాశారు. ఇప్పుడేమో పొద్దుగాల లేచిన సమయం నుండి రైతన్న.. రైతన్న.. ఇదేమాట. అప్పుడు లేని ఈ ప్రేమలు, అధికారం కోల్పోగానే జ్ఞప్తికి వచ్చాయా అంటూ తెలంగాణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా తమ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో రైతన్నల పేరే జపిస్తున్నారు. చేవెళ్లలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. జనవరి 26 నుంచి రైతు బంధు రూ. 15000 ఇవ్వాలని, మొత్తం 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేసి చూపించాలన్నారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని, వాటిని అమలు చేసే వరకు రైతుల పక్షాన, వృద్ధుల పక్షాన, మహిళల పక్షాన, రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని సవాల్ విసిరారు. అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసే వరకు తెలంగాణ ప్రజల పక్షాన రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేదే లేదని కూడ హెచ్చరించారు.
ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాడు అధికారంలో ఉన్న సమయంలో రుణమాఫీ అంటూ ప్రలోభాలు పలికి, 40 శాతం కూడ లబ్ది చేకూర్చలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నాడు రైతులను పట్టించుకోక పోగా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకే కాక, వ్యవసాయ కూలీలకు కూడ మేలు చేసేందుకు అడుగులు వేస్తుంటే ఓర్వలేక ఈ రాజకీయం ఏందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన విషయం విదితమే. అలాగే సన్న బియ్యం సాగు చేసిన రైతులకు అదనంగా రూ. 500 నగదును ప్రభుత్వం అందించింది. అంతేకాదు జనవరి 26 నుండి రైతు భరోసా పథకాన్ని కూడ అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమవుతోంది. అలాగే భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడ భరోసా అందిస్తోంది.
Also Read: Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయి.. సర్వేయర్ పోస్టు తెస్తున్నాయి
ఈ నిర్ణయాలను హర్షించక పోగా, కేటీఆర్ తన ప్రతి ప్రసంగంలో రైతన్న.. రైతన్న అంటూ పదేపదే ఉచ్చరించడంపై రైతన్నలు అప్పుడేమైంది దొరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనిపించని రైతన్న, ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కంటికి కనిపిస్తున్నాడా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, రాష్ట్ర అప్పులను తీరుస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్తుంటే, ఇదేమి గోల అంటూ తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పాత రోజులు బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.