హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్..
ఇక ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే..
Hyderabad Traffic New Rule : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధన అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. కారులో ప్రయాణించేవారందరికీ ఇకపై సీటు బెల్ట్ తప్పని సరి చేశారు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో పాటు ముందు, వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
లేకపోతే సిటీ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తారు. ఇందుకోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. కారు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు మూడంచెల సేఫ్టీ పద్ధతులను తీసుకుంటున్నారు.
సీటు బెల్ట్ పెట్టుకోకపోతే జరిగే ప్రమాదాల గురించి వివరిస్తూ వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీటు బెల్ట్ పెట్టుకోని వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఫైన్ విధించనున్నారు.
అందరికీ మంచిదే..
నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాల వల్ల ప్రాణనష్టం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బైక్ ప్రయాణికులకు హెల్మెట్, కారు నడిపేవారికి సీటు బెల్ట్ రక్షణ కల్పిస్తుంది. కానీ చాలా మంది కారులో సీటు బెల్ట్ పెట్టుకోవడం లేదు. డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి మినహా ముందు, వెనుక కూర్చున్న వారు సీటు బెల్ట్‌ను పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవర్ తప్ప కారులో మిగతా ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకునే విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు పట్టించుకోలేదు. బెల్ట్ పెట్టుకోని డ్రైవర్‌కు మాత్రమే ఫైన్ విధించేవారు.
కారు ప్రమాదం జరిగితే వెనుక సీటులో ఉన్న వారు సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ముందుకు పడిపోయే అవకాశం ఉండదు. ఫలితంగా తల, ఛాతి, వెన్నెముక సహా పొట్ట భాగంలో బలమైన గాయాలు కావు. అందుకే హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అవగాహన కల్పించనున్నారు. డిజిటల్ బోర్డులతో ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు.
ప్రాణ నష్టం తగ్గించేందుకే..
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ఇటీవల సిటీలో చేపట్టిన ఆపరేషన్ రోప్ , సిగ్నళ్ల వద్ద వాహనదారులు స్టాప్ లైన్ ను దాటకుండా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని తెలిపారు.