
Rain news today Telangana(Today news in telangana):
తెలంగాణలో చినుకు జాడ లేక అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాకాల సీజన్‌లో ఇప్పటికే మూడు నెలలు ముగిసిపోయింది. అతివృష్టి, అనావృష్టితో పంటసాగులో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. జూన్ నెల వర్షాభావంతో మొదలు కాగా.. జులైలో అధిక వర్షాలు, వరదలు సాగుకు ఆటంకం కలిగించాయి. కానీ నీటివనరులు కొద్దో గొప్పో నిండటంతో పంటలసాగు మొదలైంది.
ప్రస్తుతం వరినాట్లు పూర్తవుతున్నాయి. ఇతర పంటలు మొలకల దశలో ఉన్నాయి. ఈ తరుణంలో పంటలకు నీటితడి అవసరం ఉంది. కానీ ఆగస్టులో వర్షాభావం నెలకొనడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వాతావరణశాఖ ప్రకటనతో ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు అన్నదాతలు.
సెప్టెంబర్ ఆరంభం నుంచే భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దీంతో కాస్త ఆశాజనకంగా మారింది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణశాఖ.
ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో రైతులు ఈ నెలలో వానలు పడతాయని ఆశలు పెట్టుకున్నారు.