17 Accident Black Spots on NH-65: రహదారులలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన రహదారుల అధికారులు, జాతీయ రహదారుల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెపు వెళ్లే జాతీయ రహదారి 65 పై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి, అందుకు సంబంధించిన కారణాలపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే, ఆ రహదారి గుండా తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అధికారులు వివరించారు.
హైదరాబాద్-విజయవాడ వైపునకు వెళ్లే జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను అధికారులు గుర్తించినట్లుగా మంత్రికి వివరించారు. అవి చౌటుప్పల్, చిట్యాల, పెదకాపర్తి, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, జనగామ క్రాస్ రోడ్స్, దురాజ్ పల్లి జంక్షన్, ముకుందాపురం, అకుపాముల, కోమరబండ క్రాస్ రోడ్స్, కటకం గూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, నవాబ్ పేట జంక్షన్, రామాపురం క్రాస్ రోడ్స్ తోపాటు మొత్తం 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించినట్లుగా మంత్రికి వివరించారు.
Also Read: Bus catches fire in Haryana: హర్యానాలో ఘోరం, మంటల్లో బస్సు.. 10మంది సజీవ దహనం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద తీసుకోవాలని జాగ్రత్తల గురించి మంత్రి అధికారులకు సూచించారు. అదేవిధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వేగ నియంత్రణకు సంబంధించినటువంటి చర్యలను కూడా వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. దీంతో రోడ్ల ప్రమాదాలను నివారించడానికి అవకాశముందని తెలిపారు. రహదారిపై పలు చోట్లా జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్ లు, సర్వీసు రోడ్లు, ఆరు లేన్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
అయితే, రోడ్డు ప్రమాదాల విషయంలో స్వీడన్ సాధించిన విషయం తెలిసిందే. అక్కడ రహదారులలో సురక్షిత మౌలిక సుదుపాయాలు, సైకిల్ చోదకులకు, పాదచారులకు అనుకూలైమనటువంటి విధానాలు, వేగానికి సంబంధించినటువంటి పరిమితులు విధించడం ద్వారా అక్కడ సున్నా ప్రమాదాల స్థాయిని సాధించింది. అయితే, భారత్ కూడా సున్నా ప్రమాదాల స్థాయిని చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 2025 నాటికి 50 శాతం, 2030 నాటికి డెత్ రేటును సున్నా స్థాయికి చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి వాహనదారులకు పలు సూచనలు చేసింది.
Also Read: రేవంత్ కేబినెట్ విస్తరణ, వాళ్లకే ఛాన్స్!
అయితే, ఈ నేపథ్యంలో వాహనదారులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. వేగ నియంత్రణ అనేది ప్రమాదాల నివారణకు కీలకంగా ఉంటుంది. వాహనాలు నడుపుతున్న సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవకాశముంటుంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండడం, వేగ నియంత్రణ ఉండడం, హెల్మెంట్ ధరించడం, సీటు బెల్ట్ ధరించడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపకుండా ఉండడం, అత్యంత ముఖ్యమైన విషయం మైనర్లు వాహనాలు నడపకుండా జాగ్రతలు తీసుకోవడం.. ఇలా పలు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను నివారించి స్వీడన్ మాదిరిగానే సున్నా ప్రమాదాల స్థాయిని చేరే అవకాశం లేకపోలేదు.