Bonalu Festival 2025: హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆషాఢ మాసం బోనాల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 26న గోల్కొండలో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ఆ రోజే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. జులై 13న అత్యంత ఆడంబరంగా లష్కర్ బోనాలు జరుగుతాయి. అనంతరం జులై 20న లాల్ దర్వాజాలో బోనాల పండగ జరుగుతంది. చివరగా జులై 24న హైదరాబాద్‌లో జరిగే బోనాల జాతరతో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో బోనాల పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఆషాడమాసంలో బోనాల శోభతో రాష్ట్రం అంతటా అమ్మవారి ఆలయాల్లో బోనాలను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా బోనాల పండుగ జూన్ 26న ప్రారంభం కానుంది. మొదటగా గోల్కొండ, లష్కర్, బల్కంపేట అమ్మవారి ఆలయాలలో వరుసగా బోనాలు సమర్పించి.. మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాకుండా పలహారం బండ్లను ఊరేగింపు చేసి శివశక్తులు, పోతురాజుల విన్యాసాలతో.. ఎంతో భక్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
బోనం అంటే భోజనం. అమ్మవారు వర్షాకాలంలో కలిగే వ్యాధుల వ్యాప్తి చెందకుండా.. కుటుంబాలను చల్లగా చూడాలని బోనం సమర్పిస్తారు. అందుకే కుండలో పెరగన్నం, దానిపైన చల్లని వేప నీరు, దానిపైన దీపాలు పెట్టి బోనాలను సమర్పిస్తారు. ఆ తల్లి ఈ బోనం స్వీకరించి మనల్ని చల్లగా చూస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. గోల్కొండ కోటకు, జగద్ధాంభిక అమ్మవార్లకు వందల ఏళ్ల నాటి చిరిత్ర ఉంది. ఇక్కడ వెలసిన అమ్మవారు భక్తులకు కొంగు బంగారం అని భావిస్తారు. కాకతీయులు, తానీషా కాలం నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుంచి పటేల్ వంశం బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ సమర్పించే బోనంను నజర్ బోనం అని కూడా అంటారు. ఇప్పటికీ కూడా ఆయా వంశాల వారు వందల ఏళ్లుగా తమ కుటుంబం వారు బోనాలను సమర్పిస్తున్నారు.
అంతేకాకుండా హైదరాబాద్‌కు గోల్కొండ అనేది ఒక మణిహారం. అందుకే ఇక్కడ తొలిబోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. గోల్కొండ బోనాల తర్వాత బల్కంపేట ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు. జూన్ 26వ తేదీ గురువారం మొదటి బోనం .. జూన్ 29వ తేదీ ఆదివారం రెండవ బోనం, జూలై 3వ తేదీ గురువారం మూడవ బోనం, జూలై 6వ తేదీ ఆదివారం నాల్గవ బోనం, జూలై 10వ తేదీ గురువారం ఐదవ బోనం, జూలై 13వ తేదీ ఆదివారం ఆరవ బోనం, జూలై 17వ తేదీ గురువారం ఏడవ బోనం, జూలై 20వ తేదీ ఆదివారం 8వ బోనం, జూలై 24వ తేదీ గురువారం 9వ బోనం నిర్వహించనున్నారు.
Also Read: ఐదేళ్ల తర్వాత కైలాస యాత్ర పున:ప్రారంభం.. మానస సరోవర్ ఎలా వెళ్ళాలి?
ప్రభుత్వం తరుపున అమ్మవారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తారు. తమకు ఎటువంటి ఆపద రాకుండా చూడమంటూ అమ్మవారిని కోరుకుంటారు భక్తులు. తెలంగాణతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ బోనాల ఉత్సవాన్ని జరుపుకుంటారు.