Once again conflict between Andhra Telangana employees: గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న ఆంధ్రా, తెలంగాణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య సరైన సంప్రదింపులు లేకుండానే కేంద్రం రాష్ట్రాన్ని అప్పట్లో రెండుగా విడదీసింది. అటు నీటి వ్యవహారం, ఉద్యోగుల వ్యవహారం, ఆస్తులు, అప్పుల లెక్కలు తేలకుండానే ఈ పదేళ్లు సాగిపోయాయి. ఇటీవలే పది సంవత్సరాలు పూర్తి అయింది. ఇక తెలంగాణలో ఆస్తులపై ఆంధ్రాకు ఎటువంటి హక్కులూ ఉండవని తెలంగాణ సర్కార్ స్పష్టత ఇచ్చేసింది. ఇప్పుడు విద్యుత్ శాఖలో అత్యంత కీలకమైన పదవి విషయంలో రేవంత్ సర్కార్ చిక్కుల్లో పడనుందని తెలుస్తోంది.గత ఆగస్టు 31తో విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి పోస్టు ఖాళీ అయింది. ఇప్పుడు కొత్తగా ఆ పదవిని ఎవరికి అప్పగిస్తారనే సమస్య మొదలయింది. తమ ప్రాంతం వారికే ఆ పదవి ఇవ్వాలని ఆంధ్రా ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం అనేక త్యాగాలు చేసి, ఉద్యమాలు చేసి కోరి తెచ్చుకున్న తెలంగాణకు మరోసారి అన్యాయం చేస్తారా అంటూ తెలంగాణ ఉద్యోగులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్లుగా ఆంధ్రులదే పెత్తనం
తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులు మాత్రం ఇదంతా గతంలో విద్యుత్ తనిఖీ అధికారి పోస్టులన్నీ ఆంధ్రా ప్రాంతం వారే నిర్వహించారని..వారి హయాంలో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా చేయాలంటే ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతనే తనిఖీ అధికారిగా నియమించుకోవడమే బెటర్ అనుకుంటున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ ఆవిర్భావం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని..ఈ దశాబ్ద కాలంలో ప్రధాన తనిఖీ అధికారి పోస్టులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితోనే నడిపిస్తూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి విద్యుత్ తనిఖీ అధికారి పోస్టు చాలా కీలకమైనది. విద్యుత్ వినియోగానికి సంబంధించిన సర్టిఫికెట్ల జారీ అధికారం ఈ తనిఖీ అధికారులకే ఉంటుంది. గతంలో లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చేవారని..ఇప్పుడు కొత్తగా తెలంగాణ అధికారిని నియమిస్తే వారి ఆటలు సాగవు. అందుకే ఆంధ్రా ఉద్యోగులు ఈ పోస్టు కోసం అంతగా పట్టుబడుతున్నారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
రేవంత్ సర్కార్ పై ఒత్తిడి
ఎలాగైనా ఈ సారి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ఈ తనిఖీ అధికారి పోస్టు దక్కాలని రేవంత్ సర్కార్ పై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఏపీ ఉద్యోగులు సైతం ఈ విషయంలో తగ్గేదిలే అంటూ వెనకడుగు వేయడం లేదు. ఇటీవలే రేవంత్ సర్కార్ తెలంగాణ దశాబ్ది ఉత్యవాలు వైభవంగా రాష్ట్రంలో జరిపించారు. సోనియా గాంధీ కూడా వస్తారని ప్రచారం జరిగింది. సోనియా గాంధీని తెలంగాణకు రప్పించి..కేవలం ఆమె చూపిన చొరవ వలనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెబుదామని అనుకున్నారు. అయితే ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ కార్యక్రమానికి రాలేకపోతున్నానని వివరణ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ కు విద్యుత్ శాఖ తనిఖీ అధికారి పోస్టు పెద్ద తలనొప్పిగా తయారయ్యేలా కనిపిస్తోంది. ఒక వేళ ఆంధ్రా వైపు మొగ్గు చూపితే ఇక్కడ ప్రతిపక్ష నేతలు రేవంత్ సర్కార్ పై విమర్శలు చేసేందుకు రెడీ గా ఉన్నారు. మరి ఈ సున్నితమైన అంశాన్ని రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాలి.