Osmania Doctors: స్వేచ్చ బ్యూరో: వైద్యరంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, దేశంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు అభినందనలు తెలపడానికి సొసైటీలోని ‘సెలబ్రిటీలకు’ చేతులు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిరుపేదల ప్రాణాలను నిలబెడుతూ, అత్యంత సంక్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన ప్రభుత్వ వైద్యుల ప్రతిభను గుర్తించడంలో సమాజంలోని ప్రముఖులు, పొలిటికల్ వర్గాలు, సినీ చిత్ర పరిశ్రమ, కార్పొరేట్ వర్గాలు ప్రదర్శిస్తున్న ‘నిశ్శబ్దం’ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తాజాగా లక్షల రూపాయల ఖర్చుతో కూడిన కార్పొరేట్ వైద్యానికి ఏమాత్రం తీసిపోని విధంగా, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దేశంలోనే మొదటిసారిగా ఒక అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతం చేశారు. ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన ప్రభుత్వ డాక్టర్ల బృందం అత్యంత సమయం శ్రమించి ఈ అరుదైన రికార్డును సాధించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరితే జేబులు గుల్లయ్యే ఇటువంటి శస్త్రచికిత్సను, రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ దవాఖానాలో విజయవంతం చేసి పేదవాడి ప్రాణాన్ని నిలబెట్టారు.పైగా ఓ కార్పొరేట్ దవాఖాన చేతులెత్తినా పేషెంట్ కు ఉస్మానియా డాక్టర్లు అండగా నిలిచి ప్రాణాలు కాపాడారు. కానీ ఆ డాక్టర్ల బృందానికి ఎలాంటి కాంప్లిమెంట్స్ రాకపోవడం గమనార్హం. ప్రభుత్వం తరపున వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రత్యేక సన్మానం చేసినప్పటికీ, సొసైటీ నుంచి కనీసం స్పందించకపోవడం విచిత్రంగా ఉన్నదంటూ ప్రభుత్వ డాక్టర్లు ఆశ్చర్యాన్ని వ్య క్తం చేశారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో చిన్నపాటి సక్సెస్ సాధించినా, ఎవరైనా ప్రముఖుడికి చిన్న చికిత్స జరిగినా సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేసే చిత్ర పరిశ్రమ, ప్రముఖులు, పొలిటికల్ వర్గాలు, కార్పొరేట్ డాక్టర్లు.. ఉస్మానియా డాక్టర్ల ఇంతటి భారీ విజయాలపై మాత్రం నోరు మెదపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఓ కార్పొరేట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సర్జరీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు, చిత్రపరిశ్రమలోని కొందరు, పొలిటికల్ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేగాక మిగతా కార్పొరేట్ ఆసుపత్రుల్లోని కొందరు డాక్టర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. కానీ ఉస్మానియా వైద్యులకు కనీసం కంగ్రాచ్యులేషన్ చెప్పలేని స్థితిలో ఆయా వర్గాలు వ్యవహరించడం విమర్శలకు దారీ తీస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ ఇచ్చే పబ్లిసిటీ స్టంట్స్, ప్రమోషన్లకు ఇచ్చే ప్రాధాన్యత.. నిజమైన సేవ అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు ఎందుకు దక్కడం లేదు? అని సర్కారీ దవాఖాన డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Joshua Tromp: హారిస్ రవూఫ్ ఒక్కడే ప్రపంచంలోనే భయంకరమైన బౌలర్
చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రైవేట్ ఆసుపత్రులను ప్రమోట్ చేస్తారు. కానీ, రాత్రింబవళ్లు వేలాది మంది రోగులకు సేవలందిస్తూ, అద్భుతాలు సృష్టిస్తున్న ప్రభుత్వ దవాఖాన్లను ప్రమోట్ చేయడానికి వారికి సమయం దొరకడం లేదు. వ్యాపార ప్రయోజనాలే పరమార్థమా? అని ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ డాక్టర్ల సక్సెస్ మీట్లలో మెరిసే సినీ తారలు, మన ప్రభుత్వ డాక్టర్ల శ్రమను గుర్తించకపోవడం వారి వ్యాపార దృక్పథాన్ని సూచిస్తోంది. ఇక తోటి వైద్యులు సాధించిన ఘనతను అభినందించడానికి కార్పొరేట్ వైద్య ప్రముఖులు కూడా ముందుకు రాకపోవడం వైద్యరంగంలో ఉన్న వృత్తిపరమైన ఈర్ష్యను, పక్షపాతాన్ని బట్టబయలు చేస్తోందని ప్రభుత్వ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రులంటే కేవలం సౌకర్యాలు లేనివని, పేదలు మాత్రమే వెళ్తారనే అపోహను ఉస్మానియా డాక్టర్లు తమ రికార్డు సర్జరీలతో పటాపంచలు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా చేయలేక చేతులెత్తేసిన ఎన్నో కేసులను మన ఉస్మానియా, గాంధీ వైద్యులు విజయవంతం చేసిన దాఖలాలు ఉన్నాయి. మన ప్రభుత్వ వైద్యులకు కావాల్సింది కేవలం జీతాలు మాత్రమే కాదనే అంశాన్ని చాలా సార్లు తేటతెల్లం చేశారు. సమాజం నుంచి లభించే కనీస గుర్తింపు, అభినందనలు,సెలబ్రిటీల ప్రశంసలు లేకపోయినా వారి సేవలు ఆగవు. అయితే ప్రభుత్వ వైద్య వ్యవస్థను ప్రమోట్ చేయడం అంటే నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందనే నమ్మకాన్ని పెంచడమేనని సర్కారీ డాక్టర్లు వివరిస్తున్నారు.
Also read: సల్కం చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్.. నివేదిక ఇవ్వని ప్రభుత్వ శాఖలు!