Palakurthi politics: పాలకుర్తి నియోజకవర్గంలో ఒండెద్దు పోకడలకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. తొర్రూరు మండలంలో ఇటీవల ఆరుగురిపై సస్పెన్షన్ వేటు వేయించిన కీలక నేత ఝాన్సీ రెడ్డి నిర్ణయం గంటల వ్యవధిలోనే రాజకీయంగా పెద్ద వివాదంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలతో సస్పెన్షన్ ప్రకటించడమే కానీ, అంతర్గత నియమావళి ప్రకారం ముందుగా షోకాజ్ నోటీస్ ఇవ్వాలనే క్రమశిక్షణా ప్రోటోకాల్‌ను పట్టించుకోకపోవడం డీసీసీకి ఆగ్రహం తెప్పించింది.
షోకాజ్ ఇవ్వకుండా నేరుగా సస్పెండ్ చేస్తే అది ఏ న్యాయసమ్మతం? అన్న ప్రశ్నతో జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా స్పందించడంతో, తొర్రూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంచు సంతోష్ వెనక్కి తగ్గక తప్పలేదు. తనకు సస్పెండ్ చేసే అధికారం లేదని బహిరంగంగా ప్రకటన విడుదల చేస్తూ, ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీని వెంటనే మేరుగు మల్లేశం గౌడ్, చిట్టిమల్ల మహేష్, జాటోత్ బాలు నాయక్, ఎద్దు మహేష్, జినుగ రవీందర్ రెడ్డి, ధర్మారపు శ్రీనివాసు, ధర్మారపు వంశీకృష్ణ వంటి నాయకులు పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేస్తూ వివాదానికి తాత్కాలిక తెరపడింది.
ఇదంతా ఇలా మొదలైంది
ఇటీవల కాలంలో పాలకుర్తి నియోజకవర్గంలో అంతర్గత వర్గ పోరాటాలు, స్థానిక స్థాయిలో ఆధిపత్య పోరులు తిరిగి తలెత్తుతున్నాయనే చర్చ మధ్య, తొర్రూరు మండలంలో కొంతమంది నేతలు పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నమోదయ్యాయి. ఆవేశపూరితంగా, లేదా యోచనాపూర్వకంగానో అన్న దానిపై వాదనలు ఉన్నప్పటికీ, ఝాన్సీ రెడ్డి వర్గం వేగంగా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చిందన్న అభిప్రాయం కొందరిది. అదే సమయంలో సంస్థాగత పరిరక్షణ దృష్ట్యా డీసీసీ మాత్రం, క్రమశిక్షణ పేరుతో జరిగే ప్రతీ చర్యా, పార్టీ రాజ్యాంగంలో చెప్పిన ప్రక్రియల ప్రకారం ఉండాలి అంటూ కఠినంగా నిలిచింది. ఫలితంగా ఆరు మంది నాయకులను సస్పెండ్ చేసిన ప్రకటనపై కేవలం గంటలు గడవకముందే అధికారం, విధానం, న్యాయబద్ధతల చుట్టూ ప్రశ్నలు పెరగడంతో నిర్ణయం వెనక్కి వెళ్లింది.
ఈ ఎపిసోడ్‌లో రెండు విషయాలు స్పష్టమయ్యాయి. మొదటిది, స్థానిక స్థాయిలో తీసుకునే తక్షణ రాజకీయ చర్యలు ఇకపై యాదృచ్ఛికంగా ఉండలేవు. పై స్థాయి సంస్థాగత నియంత్రణ బిగుస్తోందన్న సందేశం వెళ్లింది. రెండోది, పార్టీలో ఏ నేతకైనా సస్పెండ్ అనే గట్టి మాటను ఉపయోగించే ముందు నిర్దిష్ట దర్యాప్తు, షోకాజ్, వివరణ, కమిటీ అభిప్రాయం వంటి స్టెప్పులు తప్పనిసరిగా అనుసరించాల్సిందే. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటికి ఆధారాలు, సాక్ష్యాలు, కమిటీ ప్రక్రియలు అన్నీ ఖచ్చితంగా ఉండాలని డీసీసీ స్పష్టం చేయడంతో స్థానిక నేతలు ఇకపై ఏకపక్ష నిర్ణయాలకు వెనకడుగు వేయాల్సి వచ్చింది.
పాలకుర్తిలో గతంలోనూ వర్గపోరు, నేతల మధ్య ఆధిపత్యం, గ్రూప్ రాజకీయాలు మాట్లాడుకునే అంశాలుగా నిలిచాయి. ఈసారి ఒండెద్దు పోకడలకు బ్రేక్ అంటూ మెసేజ్ వెళ్తున్న నేపథ్యంలో, జిల్లా నాయకత్వం స్పష్టంగా ఒక లైన్ గీసింది. ఇది రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో టికెట్ ఆశావహులు, మండల స్థాయి ఫ్యాక్షన్ లీడర్ల వ్యవహారశైలిపై ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలనే దృక్పథం ఉన్నవారికి ఇది హ్యాపీ సిగ్నల్. “అనధికార ప్రకటనలతో, ఆదేశాల పేరుతో ఎవరి భవిష్యత్తునైనా చీకటి లోయలోకి నెట్టే కాలం ముగిసింది” అన్న భావజాలం పెరుగుతోంది.
సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన నాయకుల జాబితా వెనక్కి తీసుకోవడంతో, పేర్లు వెలుగులోకి వచ్చిన మేరుగు మల్లేశం గౌడ్, చిట్టిమల్ల మహేష్, జాటోత్ బాలు నాయక్, ఎద్దు మహేష్, జినుగ రవీందర్ రెడ్డి, ధర్మారపు శ్రీనివాసు, ధర్మారపు వంశీకృష్ణల రాజకీయ ఇమేజ్ తాత్కాలికంగా అయినా క్లీన్ అయ్యింది. పార్టీని బలపరచడమే మా లక్ష్యం, వ్యవస్థను దెబ్బతీయడమే మా ఉద్దేశం కాదనే క్లారిటీతో వారు పార్టీ కార్యకలాపాల్లో కొనసాగుతున్నట్టు ప్రస్తావన రావడం, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా నేతలు లోపల లోపల సర్దుకుపోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.
ఈ పరిణామాలు కాంగ్రెస్ కోసం పెద్ద సందేశాన్ని తీసుకొచ్చాయి. బలహీనమవుతున్న సంస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలపర్చడం, క్రమశిక్షణ పేరుతో జరిగే ఏకపక్ష చర్యలను నియంత్రించడం, నిర్ణయాల్లో పారదర్శకతను చూపించడం తప్పనిసరి. వెంటనే తీసుకుని వెంటనే వెనక్కి తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం పార్టీకి అవకాశమూ, హెచ్చరికను అవకాశమంటే మరలా ఇటువంటి తప్పిదాలు జరగకుండా అంతర్గత వ్యవస్థను రీసెట్ చేసుకునే వీలు. హెచ్చరికంటే.. లోపల పగుళ్లు అలాగే కొనసాగితే, ఏ స్థానిక నేతకైనా తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టికెట్ ఆశావహుల మధ్య తీవ్ర కల్లోలం తప్పదని సంకేతం.
సంతోష్ విడుదల చేసిన ప్రకటన సస్పెండ్ చేసే అధికారం నాకు లేదన్న వాక్యం, కేవలం వ్యక్తిగత మాట కాదు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రమశిక్షణా రాజ్యాంగానికి తిరిగి అనుసరణ మొదలైనట్టు కూడా కనిపిస్తోంది. ఇకపై తొర్రూరు మండలంలోనే కాదు, పాలకుర్తి నియోజకవర్గం మొత్తం మీద, పార్టీ అంతర్గతంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా, ఆ నిర్ణయాలు కమిటీలు, క్రమబద్ధమైన విచారణ, షోకాజ్, సమాధానం, తుది తీర్పు అనే మార్గంలోనే సాగుతాయని సంకేతం. ఈ ఎపిసోడ్ ముగిసినట్టే కానీ, సంస్థాగతంగా పార్టీ ఎలా బలోపేతం అవుతుందన్న అసలు పరీక్ష మాత్రం ఇప్పుడే మొదలైంది.
డీసీసీ జోక్యంతో నిర్ణయం వెనక్కి వెళ్లి, సస్పెండ్ చేయబడ్డారని ప్రచారంలోకి వచ్చిన నాయకులు పార్టీలోనే కొనసాగుతారని స్పష్టత రావడంతో, నియోజకవర్గంలో తాత్కాలికంగా అయినా ఉద్రిక్తత తగ్గింది. కానీ వ్యక్తి ఆధిపత్యం కంటే పార్టీ గొప్పది. ఒక్క క్షణిక భావోద్వేగంతో తీసుకునే చర్యలు, పార్టీ స్థాయిలో పెద్ద దెబ్బలేనని చెప్పవచ్చు. అందుకే, పాలకుర్తిలో ఒండెద్దు పోకడలకు బ్రేక్ పడింది. ఇక ముందెవరైనా అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటే, ఇలాంటి పరిస్థితి వస్తుందన్న అసలు మెసేజ్ ఈ ఘటనతో నిరూపితమైంది.