Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు ఊడి కిందపడ్డాయి. హైదరాబాద్ లో గత మూడు, నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షానికి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వచ్చే మార్గంలో పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అయితే గత వారం రోజుల నుంచి సచివాలయంలో పలు చోట్ల సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు. ఈ రోజు పెచ్చులు ఊడిపడడంతో ఎప్పుడు.. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని.. సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయంలో పెచ్చులు ఊడిపడే సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఐదు నెలల క్రితం సచివాలయంలో పెచ్చులు ఊడిపడ్డాయి.. ఐదో అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడడంతో అప్పుడు కూడా పెనుప్రమాదం తప్పింది. తరుచుగా సచివాలయంలో పెచ్చులు ఊడి పడుతుండడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన సచివాలయంలో పదేపదే ఇలాంటి సమస్యలు తలెత్తడం ఆందోళనకరంగా మారింది.
తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో.. సచివాలయ నిర్మాణంలో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి. వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భారీ భవనంలో సోలార్ ప్యానెల్స్, ఆధునాతన సదుపాయాలతో నిర్మించారు. మంత్రుల కార్యాలయాలను కూడా అత్యాధునికంగా నిర్మించారు. అయితే.. భారీ వ్యయంతో నిర్మించిన సచివాలయంలో స్వల్ప వర్షానికే పెచ్చులు కూలిపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ సంఘటనలు రాజకీయ వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి. కేసీఆర్ హయాంలో నిర్మించిన సచివాలయ భవనాన్ని క్వాలిటీ ప్రమాణాలు పాటించలేదని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు. సచివాలయం భద్రత, నిర్మాణ నాణ్యతపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.
ALSO READ: UPI Transactions: ఫోన్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్..? రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చేస్తే..?
ALSO READ: CM Revanth Reddy: చెప్పినట్టే బరాబర్ చేసి చూపించాం.. కాదని ప్రూఫ్ చేయగలరా, ఇదే నా ఛాలెంజ్