Pastor Preveen Pagadala Wife : క్రైస్తవ సమాజం ఆగ్రహంతో ఊగిపోతోంది. క్రైస్తవ సంఘాలు కాక మీదున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపేశారంటూ మండిపడుతున్నాయి. గతంలో ఆయనకు పలు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని.. తల నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారని.. ఆ దుర్మార్గులే ప్రవీణ్‌ను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాయి. మూడు రోజులు అవుతున్నా.. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి రాలేదు. గట్టి క్లూ ఒక్కటి కూడా లభించలేదు. సీసీఫూటేజ్‌తో ఏమీ తేలలేదు. అసలు, ప్రవీణ్ హత్యా? కాదా? అనే క్లారిటీ కూడా ఇప్పటికీ రాలేదు. ఆయన అనుచరులు, ఆ వర్గం వాళ్లు మాత్రం ఇది ముమ్మాటికీ మర్డరే అంటున్నారు. సీబీసీఐడీ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగిన కొవ్వూరు, రాజమండ్రి ఏరియా నుంచి.. అంత్యక్రియలు జరిగిన హైదరాబాద్ వరకూ.. గంటల తరబడి నాన్‌స్టాప్ హైటెన్షన్.
పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణంపై సోషల్ మీడియాలో తీవ్ర రచ్చ జరుగుతోంది. మతభావాలతో కూడుకున్నది కావడంతో.. పోలీసులు ఈ కేసును చాలా సెన్సిటివ్‌గా డీల్ చేస్తున్నారు. ప్రవీణ్‌ను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చారు. దాదాపు అందరూ ఇది హత్యేనని భావిస్తున్నారు. ప్రవీణ్‌ను ఎవరో చంపేశారని అంటున్నారు. రివేంజ్ తీర్చుకుంటామని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏ ఒక్కరూ తగ్గట్లే.. తగ్గేదేలే అంటూ కోపంగా ఉన్నారు. ఒక్కరు మినహా…….
పగ వద్దు.. ప్రవీణ్ భార్య చెప్పింది వింటే..
ఇంతటి ఉద్రిక్త వాతావరణంలో, తీవ్రబాధలో ఉండి కూడా.. కన్నీళ్లు తుడుచుకుంటూ.. ఆవేదనను గుండెల్లో దాచుకుంటూ.. ప్రవీణ్ భార్య జెస్సికా పగడాల ప్రజల ముందుకొచ్చారు. తన భర్తకు మద్దతుగా వచ్చిన ప్రజానికానికి ధన్యవాదాలు చెప్పారు. తన భర్తను చూస్తే తనకు గర్వంగా ఉందని చెప్పారు. ఆయన ఆచరించి చూపిన మార్గాన్ని అంతా అనుసరించాలని కోరారు. ప్రవీణ్ అందరినీ క్షమిస్తాడని.. మీరు కూడా క్షమించాలని అన్నారు. తాను ఎవరిపైనా పగ తీర్చుకోనని.. తాను ఇప్పటికే అందరినీ క్షమించేశానని చెప్పారు. మనం ఉన్నది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని.. శాంతియుత ప్రపంచం కోరుకోవడానికంటూ ప్రవీణ్ తరుచూ చెప్పే మాటలు గుర్తు చేశారు ఆయన భార్య జెస్సికా పగడాల.
జెస్సికా.. నీకు సలాం…
వందలాదిగా తరలి వచ్చిన అభిమానులను ఉద్దేశించి జెస్సికా చేసిన ఈ వ్యాఖ్యలు చాలా బాధ్యతతో కూడుకొని ఉన్నాయని అంటున్నారు. అంత బాధలోనూ.. విషయ తీవ్రతను గుర్తించి.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. ఇలాంటి శాంతి వచనాలు చెప్పడం నిజంగా అభినందనీయమని కొనియాడుతున్నారు. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితిని తగ్గించడానికి దోహదపడతాయని చెబుతున్నారు. పగ, ప్రతీకారం అని రగిలిపోకుండా.. అందరినీ క్షమించడం ముఖ్యం అంటూ ప్రవీణ్ వైఫ్ జెస్సికా పగడాల ఇచ్చిన మెసేజ్ ఆదర్శప్రాయంగా ఉంది.
ప్రవీణ్ ఎలా చనిపోయాడనే దానికి ఇప్పటికీ స్పష్టత లేదు. యాక్సిడెంటా? మర్డరా? అనేది ఇంకా తేలలేదు. చంపేశారంటూ ఇప్పుడే ఓ అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాకపోవచ్చు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీఫూటేజ్‌లో ఓ రెడ్ కార్ మినహా పెద్దగా డౌట్ పడాల్సిన దృశ్యాలేమీ కనిపించలేదు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక కానీ ప్రవీణ్ ఎలా మరణించాడో క్లారిటీ రావొచ్చు. పోలీసుల విచారణ ముగిశాక కానీ అసలు సంగతి తెలుస్తోంది. అంతలోనే ప్రవీణ్‌ను చంపేశారు.. అది వాళ్ల పనే.. వాళ్ల అంతు చూడాలి.. అంటూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కామెంట్లు, మీడియాలో డైలాగులు వదులుతుండటం కరెక్ట్ కాదు. ప్రవీన్ భార్య జెస్సికా చూపించిన మెచ్యూరిటీ మిగతా వాళ్లూ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.