అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో ఓ పైలెట్ తో పాటు ఆయన ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. అలస్కాలో మంచు సరస్సులో విమానం కూలిపోగా, గడ్డకట్టే చలిలో రాత్రంతా విమానం రెక్కల మీదే కూర్చొని నరకయాతన అనుభవించారు. గాలింపు చర్యలు చేపట్టిన అలస్కా నేషనల్ గార్డ్స్.. ముగ్గురిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు.
అలస్కా సరస్సులో కూలిన విమానం
తాజాగా పైపర్ PA-12 సూపర్ క్రూయిజర్ చిన్న విమానం అలస్కాలోని తుస్సుమెనా సరస్సులో కూలిపోయింది. మంచు కారణంగా సరస్సు గడ్డకట్టిపోవడంతో విమానం పాక్షికంగా మునిగిపోయింది. విమాన ప్రమాదం తర్వాత పైలెట్, అందులోని ఇద్దరు పిల్లలు నెమ్మదిగా డోర్లు ఓపెన్ చేసుకుని రెక్కల మీదికి చేరారు. దాదాపు 12 గంటలు గడ్డకట్టే చలిలో అరిగోస పడ్డారు. అదే సమయంలో విమానం పైలెట్ తమను కాపాడాలంటూ ఫేస్ బుక్ వేదికగా పోస్టు పెట్టాడు. ఈ పోస్టును మరో పైలెట్ టెర్రీ గాడ్స్ చూశాడు. వెంటనే ఆయన రంగంలోకి దిగాడు. ప్రమాదానికి గురైన విమానం కోసం టెర్రీ గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు విమానం తుస్సుమెనా సరస్సులో కూలిపోయినట్లు గుర్తించారు. తొలుత వాళ్లు చనిపోయినట్లు భావించాడు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ వారు ముగ్గురు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించాడు. తమను రక్షించాలంటూ వాళ్లు చేతులు ఊపుతూ కనిపించారు.
ఇతర సెర్చ్ పైలెట్లకు సమాచారం
విమానంలోని ముగ్గురు ప్రాణాలతో ఉన్నారని గ్రహించిన టెర్రీ.. మిగతా సెర్చ్ పైలెట్లకు రేడియో ద్వారా సమాచారం అందించారు. ఆ ప్రాంతంలోని మరో పైలట్ డేల్ ఐషర్ కాల్ ను స్వీకరించడంతో పాటు మెరుగైన సెల్ సర్వీస్ ను ఉపయోగించి, అధికారులకు కచ్చితమైన వివరాలు అందించారు. అలాస్కా నేషనల్ గార్డ్స్ వెంటనే స్పందించి, ముగ్గురిని ప్రమాద స్థలం నుంచి రెస్క్యూ చేశారు. ఇక పైలెట్ టెర్రీ.. ఇదో అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ గా అభివర్ణించారు. ఆ ముగ్గురు రక్తం గడ్డకట్టే చలిలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. రెక్కల పైనే కూర్చొని నరకయాతన అనుభవించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో విమానం దాదాపు మునిగిపోయి, రెక్క, కాస్త తోక భాగం నీటి మీద కనిపిస్తుందన్నారు. “మేం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాం. కానీ, వారిని గుర్తిస్తామో? లేదో? అనుకున్నాం. పర్వతాలపై దట్టంగా మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. కానీ, సెర్చ్ ఆపరేషన్ మొదలైన గంటలోపే వారిని గుర్తించాం. వారు బతికి ఉండటం ఇంకా సంతోషంగా అనిపించింది” అని మరో పైలెట్ ఐషర్ తెలిపారు.
భాదితులు ఆస్పత్రికి తరలింపు
ఇక విమాన ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గుకి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే, ప్రాణాపాయ స్థాయిలో గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. యాంకరేజ్ కు నైరుతి దిశలో 80 మైళ్ల దూరంలో ఉన్న తుస్తుమెనా సరస్సు సమీపంలో ఆకస్మిక, శక్తివంతమైన గాలులు వీస్తుంటాయి. తాజాగా ప్రమాదానికి కూడా తీవ్రమైన గాలులే కారణం కావచ్చని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also: పైసా ఖర్చులేకుండా ఏడాదిగా ట్రైన్ లో ఫ్రీ జర్నీ, ప్రయాణీకుడి తెలివికి రైల్వే అధికారుల షాక్!