Vamsi Krishna: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు వర్గాల మధ్య ఉన్న తీవ్ర విభేదాలు మరోసారి బయటపడ్డాయ్. సొంత పార్టీ నేతలపై.. ఎంపీ వేసిన సెటైర్లు ఇప్పుడు జిల్లా దాటి టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారాయ్. ఇందుకు.. ఈ లెటరే మెయిన్ రీజన్.
రాహుల్ సభకు డుమ్మా..
నవంబర్ 2న.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు.. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అధికారికంగా రాసిన లేఖ ఇది. నవంబర్ 1న.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో.. రాహుల్ గాంధీని దేశ భావి ప్రధానిగా చేయాలనే ధృడ సంకల్పంతో, బీజేపీ ఓట్ చోరీ కుట్రలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్వహించిన కీలక ర్యాలీకి.. మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరుకాలేదని అందులో ఎత్తిచూపారు. ఇంతటి కీలకమైన సభను పక్కనపెట్టి, మంథనిలో 3 కోట్లకు పైగా ఖర్చుతో నిర్వహించిన ఓ ప్రైవేట్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారని తనకు తెలిసిందని లేఖలో రాశారు. అయితే, ఇటీవల మంథనిలోని జరిగిన పరిణామాలపై కొంత ఆందోళన కలుగుతోందన్నారు. కొయ్యూరు ప్రభుత్వ పాఠశాలలో.. కాకా వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు.
మంత్రి, ఎమ్మెల్యేలపై ఎంపీ సంచలనం..
ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు.. ఓ గిరిజన మహిళా ప్రజాప్రతినిధితో పాటు కార్యకర్తలకు మరుసటి రోజే షోకాజ్ నోటీసులివ్వకుండా సస్పెండ్ చేయడాన్ని ఎంపీ తీవ్రంగా తప్పుబట్టారు. సొంత పార్టీ ఎంపీతో కలిసి.. పేదలకు సాయం చేయడం క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన సభకు హాజరుకాకపోవడాన్ని అంతకంటే తీవ్రమైన ఉల్లంఘనగా భావించాల్సి ఉంటుందన్నారు. అయితే.. సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయరమణారావుకు ఎలాంటి నోటీసులివ్వకుండా, వారిని సస్పెన్షన్ నుంచి మినహాయించాలని వ్యంగ్యంగా కోరారు.
బ్యాగుల పంపిణీ రచ్చ..
పేద విద్యార్థులకు బ్యాగులు పంచడం తప్పైతే.. రాహుల్ గాంధీ సభకు హాజరుకాకపోవడం అంతకంటే పెద్ద తప్పు ఎందుకు కాదో ఆలోచించాలన్నారు. మంత్రి అయినా, ఎంపీ, ఎమ్మెల్యేలైనా, ఓ గిరిజన వార్డు సభ్యురాలైనా.. కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఒకే న్యాయం, ఒకే రూల్ వర్తించాలని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబుకు.. ఎంపీ వంశీకృష్ణ రాసిన లెటర్ జిల్లాలోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. నాయకుల మధ్య విభేదాలతో.. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ నలిగిపోతోంది. వెంటనే.. అధిష్ఠానం జోక్యం చేసుకొని.. ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.
Also Read: సుకన్య రెడ్డి పేరిట ఫేక్ ప్రొఫైల్.. ట్రేడింగ్ యాప్‌లో కానిస్టేబుల్‌కు రూ.30 లక్షల టోకరా!