Ponguleti Srinivas: స్వేచ్ఛ బ్యూరో: రెవెన్యూ, అటవీ (ఫారెస్ట్) భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన సచివాలయంలో రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు ,సర్వే, సెటిల్‌మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సరిహద్దు వివాదాల వల్ల సామాన్య ప్రజలు, రైతులు ఏమాత్రం నష్టపోకూడదని రెండు విభాగాలు పూర్తి సమన్వయంతో జాయింట్ సర్వేలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
జాయింట్ సర్వేతో వివాదాలకు స్వస్తి!
రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలని , ఈ సర్వేలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల సహాయంతో నిర్వహించి భూములకు స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అటవీ భూములు ఉన్నాయని, కొన్ని దశాబ్దాలుగా రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య సరిహాద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నట్లు తెలిపారు. దీంతో పాటు పట్టా భూములు, రెవెన్యూ, ఫారెస్ట్ భూముల మధ్య కూడా వివాదాలు ఉన్నాయని ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని జాయింట్ సర్వే తో శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు.
మంత్రి పొంగులేటి సంచలన ఆదేశాలు!
క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ పరిస్థితులను పరిశీలించి, రికార్డులు, మ్యాపులు, సర్వే వివరాలను సమగ్రంగా సరిపోల్చి వివాదాలకు తావులేకుండా స్పష్టమైన హద్దులను నిర్ధారించాలన్నారు.ఈ సమస్యలను ఒక శాఖపై మరొక శాఖ బాధ్యతగా నెట్టివేసే ధోరణి విడనాడాలని, పరస్పర సమన్వయంతో పరిష్కార దిశగా అడుగులు వేయాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలను అక్కడే పరిష్కరించాలని, ఉన్నతస్థాయి నిర్ణయాలు అవసరమైన అంశాలను వెంటనే రాష్ట్రస్థాయికి నివేదించాలన్నారు.ఏళ్ల తరబడి వివాదాలు కొనసాగడం వల్ల రైతులు, భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా, వాస్తవ ఆధారాలతో సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్ణీత కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు.ఇకపై రెవెన్యూ–అటవీ భూ సరిహద్దు వివాదాల పరిష్కార ప్రక్రియను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. రెండు శాఖల మధ్య సమన్వయానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తానన్నారు.
Also Read: జైలు గోడల మధ్య ఆటలు, పాటలు.. ఖైదీల్లో మార్పు కోసం మార్గదర్శిగా ఉల్లాసం!