Peerzadiguda Ankura Hospital Demands Money for Dead Bodies: హైదరాబాద్ పీర్జాదిగూడ అంకుర పిల్లల ఆస్పత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం ఇద్దరు శిశువులను చేర్పించగా.. రెండు రోజుల క్రితం ఒక శిశువు మృతి చెందింది. నిన్న మరో శిశువు కన్నుమూసింది. దీంతో ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది.
మరోవైపు ఇద్దరు పసికందుల చికిత్స కోసం అంకుర ఆస్పత్రి యాజమాన్యం దాదాపు 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. కానీ ఇద్దరినీ వైద్యులు బతికించలేకపోయారు. అంతే కాదు నిన్న మృతి చెందిన శిశువు మృతదేహం ఇవ్వాలంటే మరో లక్షా 40 వేల రూపాయలు డబ్బు కట్టాలంటూ పిల్లల తల్లిదండ్రులు, బంధువులపై ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి పెట్టింది. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. శిశువు మృతదేహాన్ని అప్పజెప్పాలంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన జెళ్ళ కిరణ్ కుమార్, మహేంద్ర దంపతులకు వారంరోజుల క్రితం హబ్సిగూడలోని పద్మజ ఆసుపత్రిలో ఇద్దరు కవలలు జన్మించారు. అయితే ఇద్దరు పిల్లల ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో పీర్జాదిగూడలోని అంకుర ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తామని చేర్చుకుని, వారం రోజులుగా ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్మెంట్ చేశారు. కానీ.. రెండు రోజుల వ్యవధిలోనే కవలలు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా తల్లితండ్రులు విలపిస్తున్నారు.
Also Read : కోట హాస్టల్ లో భారీ అగ్నిప్రమాదం..
సరైన వైద్యం అందించక పోవడం వల్లనే శిశువులు మృతి చెందారని తల్లిదండ్రులు, బంధువులు వాదిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న జర్నలిస్టులు ఆసుపత్రి వద్దకు చేరుకుని వీడియో చిత్రీకరిస్తున్న తరుణంలో ఆసుపత్రి సిబ్బంది మీడియాపై దాడికి యత్నించారు. ఇదేమని ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.