Phone Tapping : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో ఫోన్ కాల్ ఆడియోలు పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఆడియోలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ గురించి చాలావరకు డీటైల్స్ ఉన్నాయి. అమిత్ షా, బీఎల్ సంతోష్ ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. మొదటి ఆడియో లీక్.. పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్రభారతి, నంద కుమార్ ల మధ్య జరిగిందని చెబుతున్నారు. వారి సంభాషణను రోహిత్ రెడ్డి రికార్డ్ చేసి ఉంటారని అనుకోవచ్చు. కానీ, లీకైన రెండో ఆడియో అనేక అనుమానాలకు కారణమవుతోంది. కీలకమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెరమీదకు వస్తోంది.
27 నిమిషాల రెండో ఆడియోలో.. రామచంద్రభారతి, నంద కుమార్, సోమయాజులు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. మరి ఆ ముగ్గురిలో ఎవరు ఆ కాల్ రికార్డ్ చేసినట్టు? ఇంతటి సీక్రెట్ ఆపరేషన్ సంభాషణను వాళ్లే రికార్డ్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఆటోమెటిక్ రికార్డు ఆప్షన్ ఉందనుకుంటే.. నిందితుల నుంచి సీజ్ చేసిన ఫోన్ లో ఆ ఆడియో ఉండి ఉండొచ్చు. అది పోలీసుల ద్వారా మీడియాకు లీక్ చేసి ఉండొచ్చు. అంటే, కేసు విచారణలో ఉండగానే కస్టడీలో ఉన్న ఫోన్ మేటర్ ను లీక్ చేయడం వల్ల పోలీసులు చిక్కుల్లో పడే అవకాశం ఉందంటున్నారు.
ఒకవేళ ఆ ఆడియో ఆ ముగ్గురి ఫోన్లలోనూ లేకపోతే..? వారి ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేసినట్టు భావించాల్సి ఉంటుందని అంటున్నారు. అదే నిజమైతే.. చట్టప్రకారం అది మరింత సివియర్ కేసు అవుతుంది. ఇప్పటికే పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉదంతం దేశంలో కలకలం రేపగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ ఆడియోలు సైతం ఫోన్ ట్యాపింగేనని తేలితే.. కేసీఆర్ కు చిక్కులే..అంటున్నారు.