Azam : T20 వరల్డ్ కప్ లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ ల్లో భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన పాకిస్థాన్ పై అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కెప్టెన్ బాబర్ ఆజమ్ ను అయితే అందరూ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అటు బ్యాటింగ్ లో విఫలమవడమే కాదు… కెప్టెన్ గానూ గెలుపు వ్యూహాలు పన్నడంలో దారుణంగా విఫలమవుతున్నాడంటూ… బాబర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్… బాబర్ ను చెత్త కెప్టెన్ గా అభివర్ణించాడు. కెప్టెన్ గా బాబర్ దారుణంగా విఫలమయ్యాడని, వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ దాదాపు నిష్క్రమించినట్లేనని అభిప్రాయపడ్డాడు. ఆడింది చాలు… ఇక ఇంటికి వచ్చేయండంటూ బాబర్ కు చురకలంటించాడు… షోయబ్ అక్తర్.
జట్టు మేనేజ్మెంట్ పైనా అక్తర తీవ్ర విమర్శలు చేశాడు. జింబాబ్వే లాంటి చిన్న జట్టు చేతిలో… అది కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడ్డారంటే… జట్టు ఆటతీరుపై ఇప్పటికైనా మేనేజ్మెంట్‌కు జ్ఞానోదయం అవుతుందో లేదో అర్ధం కావడం లేదన్నాడు… అక్తర్. పఖర్ జమాన్ లాంటి హిట్టర్ ను కేవలం బెంచ్ కే పరిమితం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు… షోయబ్ అక్తర్.
మరికొందరు పాక్ మాజీ క్రికెటర్లు కూడా బాబర్ ఆజామ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాక్ క్రికెట్ టీమ్ కు చాలాకాలం నుంచి కెప్టెన్ గా ఉన్న బాబర్… తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడని… వాటి నుంచి ఏమీ నేర్చుకోకపోతే కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించడానికి అతను అనర్హుడని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తమ్మీద T20 వరల్డ్ కప్ తర్వాత బాబర్ కెప్టెన్సీతో పాటు… పాక్ క్రికెట్ లో చాలా మార్పులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.