PM Modi: ప్రజలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువులు.. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే తన లక్ష్యం అంటూ.. నరేంద్రుడు ఉగ్రరూపం ప్రదర్శించారు.
బేగంపేట విమానాశ్రయంలో నరేంద్ర మోదీ ప్రసంగం విన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్. అంతకు కొన్నిగంటల ముందు విశాఖ సభలో ఎంతో ప్రశాంతంగా, హుందాగా మాట్లాడిన మోదీ.. హైదరాబాద్ కు వచ్చే సరిగి పూర్తిగా మారిపోయారు. ప్రచండ కోపంతో మరోక్షంగా కేసీఆర్ పాలనపై చెలరేగిపోయారు.
సూదుల్లాంటి మాటలు. కత్తుల్లాంటి వ్యాఖ్యలు. మామూలుగా లేదు మోదీ స్పీచ్. మునుపెన్నడూ లేనట్టు తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే, ఎక్కడా కేసీఆర్ పేరుగానీ, టీఆర్ఎస్ ప్రస్తావనగానీ చేయకుండా.. ఇన్ డైరెక్ట్ గా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. బీజేపీ కార్యకర్తల్లో వెయ్యి ఏనుగుల బలం నింపేలా.. వారిలో స్పూర్తి రగిలించారు.
తెలంగాణ బీజేపీ శ్రేణులు ఎవరికీ భయపడరని, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని.. కేడర్ ను కొనియాడారు మోదీ. మునుగోడు ఉప ఎన్నికలో కార్యకర్తల పోరాట స్పూర్తిని ప్రశంసించారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదని.. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని బలంగా చెప్పారు మోదీ.