Hyderabad News: పహల్ గామ్ ఉగ్రదాని నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన పాకిస్తాన్ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ ఫయాజ్ అనే పాకిస్తాన్ యువకుడు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతిని కొద్ది కాలం క్రితం పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఆమెను కలిసేందుకు వచ్చాడు. పోలీసులు అతడిని పట్టుకున్నారు.
వీసా లేకుండా నేపాల్ మీదుగా హైదరాబాద్ కు..
ఫయాజ్ ఎలాంటి వీసా లేకుండా హైదరాబాద్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా అతడు పాకిస్తాన్ నుంచి నేరుగా నేపాల్ కు వచ్చాడు. అక్కడి నుంచి బార్డర్ క్రాస్ చేసి హైదరాబాద్ కు వచ్చాడు. పహల్ గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తానీయులను వెనక్కి పంపించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫయాజ్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న సదరు వ్యక్తి నుంచి అన్ని వివరాలను ఆరా తీస్తున్నారు. అతడు దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్ నుంచి భారత్ కు ఎలా వచ్చాడు? ఎవరు సాయం చేశారు? అనే అంశాల గురించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
పహల్ గామ్ దాడి నేపథ్యంలో కేంద్రం సీరియస్
పహల్ గామ్ లో టూరిస్టులపై ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అన్ని సంబంధాలు తెంచుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్తానీయులు ఏప్రిల్ 29లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వెనక్కి పంపించాలన్నారు.
Read Also: పహల్ గామ్ లో ఉగ్రదాడి.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
కీలక చర్యలు చేపట్టిన డీజీపీ జితేందర్
కేంద్ర హోంశాఖ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలోని పాకిస్తానీయులు అందరూ వెంటనే భారత్ ను విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఏప్రిల్ 27తో వీసాలు రద్దు అవుతాయని తేల్చి చెప్పారు. మెడికల్ వీసాలో ఉన్న వారికి ఈనెల 29 వరకు గడువు విధించారు. ఏప్రిల్ 30 వరకు వాఘా బార్డర్ ఓపెన్ ఉంటుందన్నారు. అక్రమంగా తెలంగాణలో ఉండాలని పాకిస్తానీయులు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భార్యను కలవడానికి వచ్చి పాకిస్తానీయుడు పోలీసులకు చిక్కడం విశేషం. మరోవైపు హైదరాబాద్ లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వీరంతా మరో రెండు రోజుల్లో వెళ్లిపోవాల్సి ఉంటుంది. గడువులోగా వెళ్లకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు పహల్ గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది.
Read Also: ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అలర్ట్, కాశ్మీర్ రైల్వే లింక్ భద్రత కట్టుదిట్టం!