Pahalgam Terror Attack: పహల్ గామ్ లో ఉగ్రవాదుల మారణకాండ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. అన్ని పర్యాటక ప్రాంతాలతో పాటు ముఖ్య ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచింది. ముఖ్యంగా కాశ్మీర్ పరిధిలోని రైల్వే లైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కాశ్మీర్ రైల్వే లైన్ కు అదనపు భద్రత ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించింది. ఈ మేరకు పోర్టల్ రైల్వే జమ్మూకాశ్మీర్ లో రైల్వే ఆస్తుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
USBRL వెంట మెరుగైన భద్రత
పహల్ గామ్ టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో ఉత్తర రైల్వే పరిధిలోని 272 కి.మీ. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) వెంట భద్రత కట్టుదిట్టం చేశారు. జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ వర్మ భద్రతా చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ఆయన టన్నెల్స్, బ్రిడ్జిలు సహా కీలక మౌలిక సదుపాయాలను సమగ్రంగా తనిఖీ చేశారు. USBRL అధికారులతో కలిసి రైల్వే మార్గం భద్రతపై సమీక్ష నిర్వహించారు. భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
భద్రత కట్టుదిట్టం చేసిన భారతీయ రైల్వే
ఉగ్రవాదుల నుంచి దాడులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రైల్వే అధికారులు ఆయా రైల్వే స్టేషన్లలో భద్రతా సిబ్బందిని పెంచారు. సొరంగాలు, వంతెనల దగ్గర కఠినమైన పర్యవేక్షణను అమలు చే చేస్తున్నారు. రైల్వే రక్షణ దళం (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), స్థానిక పోలీసు బలగాలతో కలిసి కాశ్మీర్ రైల్వే నెట్ వర్క్ అంతటా భద్రతను పెంచారు. ఇక జమ్మూకాశ్మీర్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో చెకింగ్ టైట్ చేశారు. సామాను స్కానింగ్ కోసం అత్యాధునిక స్కానింగ్ మిషన్లను అందుబాటులో ఉంచారు. సొరంగాలు, వంతెనల భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మెరుగైన నిఘా, పర్యవేక్షణ
అత్యంత సవాళ్లతో కూడిన USBRLలోని 111 కి.మీ కత్రా – బనిహాల్ విభాగంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ విభాగంలో 12.77 కి.మీ పరిధిలో దేశంలోనే అతి పొడవైన సొరంగం(T-50) ఉంది. 359 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ వంతెన కూడా ఉంది. వీటి భద్రత కోసం RPF, GRP, స్థానిక పోలీసులు 24 గంటల పాటు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో CCTVలను ఏర్పాటు చేశారు. ఆ ఫుటేజీని నిరంతం పర్యవేక్షిస్తున్నారు.
పర్యాటకుల తరలింపునకు ప్రత్యేక చర్యలు
అటు ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ నుంచి పర్యాటకులను తరలించడానికి ఉత్తర రైల్వే శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక వన్ వే రైలును ఏర్పాటు చేసింది. కాశ్మీర్ లోని పర్యాటకులంతా తమ సొంత స్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. రిజర్వేషన్ లేని పర్యాటకులను సైతం రైళ్లలో వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. పర్యాటకులను సేఫ్ గా తరలించేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు.
Read Also: పహల్ గామ్ లో ఉగ్రదాడి.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!