Maoist : రెండు రాష్ట్రాలు పోలీసులు. 12 వేల మంది సాయుధ బలగాలు. గంటల తరబడి కూంబింగ్. హోరాహోరీ ఎన్‌కౌంటర్. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ “హిడ్మా” కోసం భారీ ఎత్తున స్పెషల్ ఆపరేషన్ జరుగుతోంది. తుపాకీ తూటాల మోతతో ‘కర్రెగుట్టలు’ మారుమోగిపోతున్నాయి.
గంటల తరబడి ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టల్లో మావోయిస్టులు, CRPF బలగాల మధ్య బీకర కాల్పులు జరుగుతున్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో.. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను ఒకేసారి చుట్టుముట్టారు CRPF జవాన్లు. మంగళవారం ఉదయం నుంచి భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
అబూజ్‌మడ్ నుంచి తెలంగాణ వైపు..
ఇటీవల అబూజ్‌మడ్‌లో DRG బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. వరుస ఎన్‌కౌంటర్లతో గడిచిన రెండు నెలల్లోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పటికే ప్రకటించారు. దెబ్బకు ఉలిక్కిపడిన మావోయిస్టులు.. శాంతి చర్చలకు పిలుపు ఇచ్చారు. దండకారణ్యంలో కాల్పులు ఆపేస్తే.. చర్చలకు సిద్ధమని ముందుకు వచ్చారు. అయినా, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది. ఇక బతుకు జీవుడా అంటూ.. ఛత్తీస్‌గఢ్ నుంచి మళ్లీ తెలంగాణ బాట పట్టారు మావోయిస్టులు. వారంతా ములుగు జిల్లా శివారు కర్రెగుట్టల దగ్గర ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది.
కర్రెగుట్టల్లో హోరాహోరీ
కర్రెగుట్టల వైపు ఆదివాసీలు ఎవరూ రావొద్దంటూ ఇటీవలే ఓ లెటర్ రిలీజ్ చేసి.. గిరిజనులను అప్రమత్తం చేశారు మావోయిస్టులు. గుట్ట చుట్టూ పేలుగు పదార్థాలు అమర్చినట్టు చెప్పారు. ఆ విషయం పోలీసులకు తెలిసింది. బచావో కర్రెగుట్టలు పేరుతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు దాగున్న ప్రదేశాన్ని గుర్తించి.. కర్రెగుట్టలను రెండు వైపుల నుంచి చుట్టుముట్టారు. చత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉమ్మడిగా కూంబింగ్ చేపట్టాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే.. ఇరు దళాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోందని తెలుస్తోంది. మొత్తంగా 12 వేల మంది భద్రతా సిబ్బంది.. మావోల కోసం వేటాడుతున్నట్టు సమాచారం.
Also Read : గుండుకు వంద.. ఏడుకొండల్లో నిలువు దోపిడీ!
హిడ్మా కోసం వేట..
ఎందుకింత మంది? ఎందుకింత భారీ బలగాలు? అంటే కర్రెగుట్టల్లో హిడ్మా దాగున్నాడని అంటున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా పోలీసులకు, సీఆర్పీఎఫ్ సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా. చిక్కడు దొరకడు టైప్‌లో అనేక ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకుంటున్నాడు. మావోయిస్ట్ ఉద్యమంలో ప్రస్తుతం అందరికంటే ఫుల్ యాక్టివ్‌గా ఉన్నది హిడ్మానే. ఆయన సారధ్యంలోనే కోబ్రా, పోలీసులపై మెరుపు దాడులు జరుగుతున్నాయి. ఒక్క హిడ్మాను అడ్డులేకుండా చేస్తే.. ఇక దేశంలో మావోయిజం అంతం చేసినట్టే. అందుకే, హిడ్మా కోసం ఎప్పటి నుంచో వేట కొనసాగిస్తున్నాయి కోబ్రా బలగాలు. అబూజ్‌మడ్ అడవులపై మంచి పట్టున్న హిడ్మా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు. ఈసారి ఆయన కర్రెగుట్టల్లో ఉన్నాడని తెలిసి.. ఎలాగైనా టార్గెట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు రెండు రాష్ట్రాల పోలీసులు. కేంద్ర బలగాల డైరెక్షన్‌లో.. కర్రెగుట్టలకు భారీ సంఖ్యలో సాయుధ దళాలను పంపించి.. ఆపరేషన్ హిడ్మా చేపడుతున్నాయి.