BigTV English

Tirumala tonsure: గుండుకు వంద.. ఏడుకొండలవాడా, నీ ముందే నిలువ దోపిడీ!

Tirumala tonsure: గుండుకు వంద.. ఏడుకొండలవాడా, నీ ముందే నిలువ దోపిడీ!

గుండుకు వంద..
గుండుకు వంద..
గుండుకు వంద..
అవును తిరుమలలో గుండు గీయాలంటే వంద రూపాయలు లేనిదే పని జరగడంలేదు. పోనీ వారు డిమాండ్ చేసిన వంద రూపాయలు ఇవ్వకపోతే గుండు గీయరా అంటే గీస్తారు, కానీ గుండు నున్నగా రాదేమోనని, అక్కడక్కడ గాట్లు పడతాయేమోనని(పెడతారేమోనని) భక్తుల భయం. అందుకే, గుండు గీసేవారి సేవకు సంతృప్తి చెందడం అటుంచి, భయంతోనో బాధతోనో చాలామంది ఆ వందరూపాయలు సమర్పించుకుంటుంటారు. మరీ ఎక్కువ గొడవ చేస్తే నలుగురులో పరువుపోయేలా మాట్లాడతారేమోననే అనుమానం కూడా ఉంటుంది. అందుకే చాలామంది భక్తులు కల్యాణ కట్టలో నోరు మెదపకుండా డబ్బులు క్షురకుల పక్కన పెట్టి వస్తుంటారు.


డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో..
వాస్తవానికి తిరుమలలోని గుండు గీయించుకుంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా ఉచితం. కానీ కొంతమంది భక్తులు తమకు తాము సంతోషంగా క్షురకులకు కొంత మొత్తం అందిస్తుంటారు. అది దేవుడికి ఇచ్చినట్టుగానే వారు భావిస్తారు. ఇలా వారు సంతోషపడి ఇచ్చే మొత్తం ఇప్పుడు డిమాండ్ గా మారడం బాధాకరం. వంద లేనిదే గుండు గీయబోమంటూ కొంతమంది క్షురకులు తెగేసి చెప్పడం ఆశ్చర్యకరం. అలా డిమాండ్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తోంది మహిళా క్షురకురాలు కావడం మరింత ఆందోళన కలిగించే అంశం. గుండుకు వంద అంటూ మహిళా క్షురకురాలు డిమాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

గుండు ఉచితమా..? కాదా..?
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు మినహాయిస్తే.. తిరుమలలో స్వామివారి దర్శనం పూర్తిగా ఉచితం. దర్శనమే కాదు, అక్కడ వసతి, భోజనం కూడా ఉచితమే. రుసుము చెల్లించి వాడుకునే రూమ్స్ కూడా ఉంటాయి. ఇక గుండు గీయించుకోవడానికి ఎవ్వరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆ సేవ కూడా పూర్తిగా ఉచితం. భక్తులు తలనీలాలు సమర్పించే ప్రాంతాన్ని కల్యాణ కట్ట అనే పేరుతో పిలుస్తారు. అక్కడ టీటీడీ భక్తులకు ఉచితంగా తలనీలాలు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి భక్తుడికీ కొత్త బ్లేడ్ ను అందిస్తుంది. తిరుమలపై గుండు గీసే క్షురకులు టీటీడీ ఉద్యోగులు. వారికి టీటీడీ నెలజీతంతోపాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. జీతం, ఇతర అలవెన్సులు ఉన్నా కూడా క్షురకుల్లో కొంతమంది భక్తులను ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదురు వస్తున్నాయి. ఈ ఫిర్యాదుల వల్లే కల్యాణ కట్టల్లో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను బిగించారు. కానీ వాటి పని వాటిదే, వీరి పని వీరిదే. సీసీ కెమెరాలు ఉన్నా కూడా డబ్బులు తీసుకునేవారు ఎక్కడా భయపడరు. పైపెచ్చు బెదిరించి మరీ వసూలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఎవరికి ఫిర్యాదు చేయాలి..?
తిరుమలలో క్షురకులు గుండు గీసినందుకు డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
TTD హెల్ప్‌లైన్ నంబర్: 1800 425 4141 కి ఫోన్ చేసి భక్తులు తమ ఇబ్బందుల్ని అధికారులకు తెలుపవచ్చు. రోజులో 24గంటలూ ఈ హెల్ప్ లైన్ నెంబర్ పనిచేస్తుంది. ఒకవేళ నేరుగా టీటీడీ సిబ్బందికి ఫిర్యాదు చేయదలిస్తే.. ఆలయం దగ్గర హెల్ప్ డెస్క్ లు, సమాచార కేంద్రాలుంటాయి. అక్కడ కూడా భక్తులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక కల్యాణ కట్టల వద్ద ఫిర్యాదు బూత్‌లు కూడా ఉంటాయి. భక్తులు తమ ఫిర్యాదు వివరాలను పేపర్ పై రాసి ఆ బూత్ లలో ఉన్న బాక్సుల్లో వేయవచ్చు. క్షురకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తే అది ఫిర్యాదుకు మరింత బలం చేకూరుస్తుంది. అప్పటికీ సిబ్బందిలో కదలిక లేకపోతే నేరుగా టీటీడీ ఉన్నతాధికారుల్ని సంప్రదించే అవకాశం కూడా ఉంది.

మనకెందుకులే..?
గుండు గీసినందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంగా నిబంధనలున్నాయి. కానీ కొంతమంది వారికి తోచినంత డబ్బులు ఇస్తుంటారు, మరికొందరు తమకు ఇష్టం లేకపోయినా క్షురకుల డిమాండ్ కి తలొగ్గుతారు. డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేవారి సంఖ్య చాలా అరుదు. ఐనా మనకెందుకులే అనుకుంటూ చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని అంటున్నారు నెటిజన్లు. కొంతమంది డబ్బులివ్వడం అలవాటు చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని, అలా డబ్బులు ఇవ్వాలనుకున్నవారు హుండీలో వేయొచ్చు కదా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అన్నీ తెలిసినా కూడా అధికారులు మౌనంగా ఉండటం సరికాదని అంటున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా క్షురకులు డబ్బులు తీసుకుంటున్నారంటే దాన్ని అధికారుల అలసత్వం అనుకోవాలా..? లేక వారికి కూడా వాటా వెళ్తుందని అనుమానించాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వీడియోలు బయటకొచ్చినప్పుడు అధికారులు కాస్త అలర్ట్ అవుతారు. క్షురకులు కూడా కొన్నాళ్లు సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత మళ్లీ ఇది మామూలేనని మరికొందరు భక్తులు పెదవి విరుస్తున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×