Ponnam Prabhakar: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తరువాత కూడా, కేంద్రం అనుసరిస్తున్న మౌన విధానాన్ని నిలదీస్తూ ఆయన బీజేపీ నాయకులపై గళమెత్తారు.
రామమందిర ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడుతూ, ఇది దేశంలోని అత్యున్నత పదవిని అవమానపరిచే చర్యగా పేర్కొన్నారు. “రాష్ట్రపతిని ఆహ్వానించకుండా, ఆ స్థాయిలో జరిగే ఒక మతపరమైన కార్యక్రమాన్ని జరపడం వలన బీజేపీ మైనారిటీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల కూడా ఉన్న అసలైన దృష్టికోణం బయటపడింది” అంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రపతిని కలవాలనుకుంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని, ఇది అహంకార రాజకీయానికి ఉదాహరణగా నిలుస్తుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతిని కలవడం ఒక ప్రజాస్వామ్య హక్కు అని, దీనిని అడ్డుకోవడం కేంద్ర బీజేపీ నేతల బలహీనతను సూచిస్తుందని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రంగా మండిపడ్డ మంత్రి, బీజేపీ నేతలు మతపరమైన నేరేపణలు చేస్తూ బిల్లు ఆమోదానికి అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ముస్లింల పేరుతో బిల్లు అడ్డుకునే ప్రయత్నాలు అన్యాయమని, 1971 నుంచే ముస్లింలకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయనీ గుర్తు చేశారు. ఇది మతపరమైన రిజర్వేషన్ కాదని, ఇది సామాజిక న్యాయం కోసం జరిపే పోరాటమని స్పష్టం చేశారు.
జంతర్ మంతర్‌లో జరిగిన ధర్నాలో కులాలకు అతీతంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారని తెలిపారు. బీసీ బిల్లును బీజేపీ అసెంబ్లీలో మద్దతు తెలిపిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటంలో ఏమిటీ రెండుముఖాల రాజకీయం? అని నిలదీశారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆమోదించిన తీర్మానం ఆయనకు తెలియకుండా జరిగిందా? అని ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ఎదుర్కొని బలహీనపడ్డప్పటికీ, ఇప్పుడు చంద్రబాబు, నితీశ్ మద్దతుతో నడుస్తూ, బీసీల హక్కుల విషయంలో అసలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డికి నిజంగా బీసీల పట్ల మానవతా దృష్టి ఉంటే, రిజర్వేషన్ల అమలుకు కేంద్రమంత్రిగా చర్యలు తీసుకోవాలని, లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
“బీసీల నోటిదగ్గర కూడు తీసేయొద్దు” అని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఫ్యూడలిస్ట్ భావాలతో బలహీన వర్గాలకు అన్యాయం చేయడం బీజేపీకి మానసికంగా అలవాటైందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ఇక మోసానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ఆకాంక్ష ఎలా నెరవేరిందో అదే విధంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రంలో ఆమోదింపజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో పోరాడుతుందని పేర్కొన్నారు. కేంద్రమే అన్యాయం చేస్తుంటే తెలంగాణ తరఫున పోరాటం తప్పదని, బలహీన వర్గాల న్యాయాన్ని సాధించేదాకా వెనక్కి తగ్గమని తేల్చిచెప్పారు.