Eye Care: నేటి డిజిటల్ యుగంలో.. మన కళ్ళపై ఒత్తిడి చాలా వరకు పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, టీవీలు చూడటం వల్ల కళ్ళు త్వరగా అలసిపోతున్నాయి. కళ్ళ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం, కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఇంతకీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కంటి పరీక్షలు:
మీరు కళ్ళద్దాలు వాడకపోయినా ఏడాదికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇది కంటి సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకోవడానికి సహాయపడుతుంది. డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్ వంటి వ్యాధులు కళ్ళను ప్రభావితం చేస్తాయి కాబట్టి.. ఈ పరీక్షలు అవసరం.
2. 20-20-20 నియమాన్ని పాటించండి:
మీరు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పని చేస్తుంటే.. ఈ నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి.. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. ఇది కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. అలసటను తగ్గిస్తుంది.
3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి:
మీరు తినే ఆహారం కళ్ళ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. విటమిన్ ఎ, సి, ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , జింక్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. క్యారెట్లు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, బాదం పప్పు వంటివి కంటి ఆరోగ్యానికి చాలా మంచివి.
4. తగినంత నీరు తాగండి:
శరీరంలో తగినంత నీరు ఉంటే కళ్ళు పొడి బారకుండా ఉంటాయి. నీరు లేకపోతే కళ్ళు పొడిబారి, దురద, మంట వస్తాయి. కాబట్టి రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోండి.
5. సూర్యరశ్మి నుంచి రక్షణ:
సూర్యుని నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు కళ్ళకు హాని కలిగిస్తాయి. బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ వాడండి. ఇది కళ్ళను సురక్షితంగా ఉంచుతుంది. అంతే కాకుండా కంటి అలసటను తగ్గిస్తాయి.
6. ధూమపానం మానేయండి:
స్మోకింగ్ కంటి నరాలను దెబ్బతీస్తుంది. అంతే కాకుండా చూపు మందగించేలా చేస్తుంది. ఇది కాటరాక్ట్స్, మస్కులర్ డీజెనరేషన్ వంటి వ్యాధులకు కారణమవుతుంది.
7. తగినంత నిద్ర పోండి:
రోజుకు 7-8 గంటల నిద్ర కళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోతే కళ్ళు అలసిపోతాయి. అంతే కాకుండా ఎర్రగా మారతాయి. ఇలాంటివి .జరగకుండా ఉండాలంటే తగినంత నిద్ర చాలా ముఖ్యం.
Also Read: ఉదయం పూట గోరు వెచ్చని నీరు తాగితే.. ?
8. కళ్ళకు వ్యాయామం:
కంటి వ్యాయామం కళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది. మీ కళ్ళను అన్ని వైపులా తిప్పడం, దగ్గర, దూరంలో ఉన్న వస్తువులను చూడటం వంటివి చేయండి.
9. కళ్ళను చేతులతో తాకకూడదు:
చేతులలో ఉండే బ్యాక్టీరియా కళ్ళలోకి చేరి, ఇన్ఫెక్షన్‌లకు కారణం కావచ్చు. కళ్ళు దురదగా అనిపిస్తే, చేతులను శుభ్రంగా కడిగి ఆ తర్వాతే తాకండి.
10. సరైన లైటింగ్:
చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ లైటింగ్‌లో చదవటం లేదా పని చేయటం వల్ల కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. తగినంత వెలుతురు ఉండే చోట మాత్రమే పని చేయాలి.