Pragati Bhavan: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉన్న ప్రగతిభవన్ నిర్వహణ, దాని ఖర్చులపై ఆరా తీస్తున్నారు అధికారులు. కేసీఆర్ హంగూ ఆర్భాటం కోసం కోట్ల మేర ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపణలు వెల్లువెతున్నాయి. ప్రగతిభవన్ ప్రారంభించేనాడు 60 కోట్లు అవుతుందన్న అంచనా ఉంటే.. నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.200 కోట్లు దాటినట్టు అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబం కోసం బ్యాడ్మింటన్ కోర్టు, కుక్కల షెడ్డు ఏర్పాటు, ఇటలీ నుంచి ఫర్నిచర్ అంటూ కోట్లల్లో ప్రజల సొమ్మను కొల్లగొట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కలకు సంబంధించి ఆరాలు తీసిన అధికారులపై బీఆర్ఎస్ సర్కార్ వేటు వేసేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. కాగా.. చాలా విషయాల్లో ముందుగా అనుమతి లేకుండా ఖర్చు చేసి, ఆ తర్వాత పరిపాలన అనుమతులు తీసుకున్నట్టు సమాచారం.
కేసీఆర్ తన కుటుంబ సభ్యుల కోసం ప్రగతిభవన్‌లో 2 కోట్ల వ్యయంతో బ్యాడ్మింటన్ కోర్టును ఏర్పాటు చేశారట. దాని నిర్వహణ కోసం మరో 2.5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. అలాగే ప్రగతిభవన్ చుట్టూ 24 గంటలపాటు పోలీసుల పహారా ఉండగా.. కుక్కల షెడ్డును నిర్మించారట. నాలుగు కుక్కల కోసం 12 లక్షలు ఖర్చు పెట్టి షెడ్డును నిర్మించినట్టు కూడా తెలుస్తోంది. దీంతో లక్షల్లో ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించారా? లేక తప్పుడు లెక్కలు చూపారా? అనే కోణంలో ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఇక ఫర్నీచర్ కోసం భారీగా ఖర్చు చేసినట్టు కూడా సమాచారం. 25 కోట్ల విలువైన ఫర్నిచర్ ఇటలీ నుంచి తెప్పించారని.. ఈ ప్రక్రియ అంతా బీఆర్ఎస్ పాలకుల సన్నిహితుల ద్వారా జరిగినట్టు తెలుస్తోంది. టెండర్ లేకుండా కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అప్పట్లో అధికారుల మధ్య వివాదానికి దారి తీసిందని.. ఈ ఖర్చును తాము భరించలేమని అప్పట్లోనే ఆర్ అండ్ బీ శాఖ స్పష్టం చేసిందట. ఈ నేపథ్యంలో ఓ అధికారిపై బదిలీవేటు వేశారని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి.