CM Revanth Reddy: తమ ప్రభుత్వం రవాణా రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో గురువారం ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. బహిరంగ సభ వేదిక వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్ ను పరిశీలించిన సీఎం, డ్రైవింగ్ సీట్లో కూర్చొని వాహనం యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే వెహికల్ స్కాపింగ్ పాలసీపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ప్రజా సంక్షేమ పాలన సాగిస్తుందన్నారు. ప్రధానంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రవేశపెట్టామని, లక్షల మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి చేకూరిందన్నారు.
115 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని, బస్సు ప్రయాణంతో రూ. 3902 కోట్లు మహిళలు ఆదా చేసుకున్నట్లు తెలిపారు. రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎలక్ట్రికల్ బస్సులను కూడా తాము అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత వాహనాల వినియోగంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే కాలుష్య మహమ్మారి నుండి రక్షింపగలుగుతామన్నారు.
ఏడాది పాలనలో రవాణా శాఖ ఎన్నో విజయాలను సాధించిందని, గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ చనిపోతే కనీసం పరామర్శ కూడా చేయలేదన, ఇదేనా పాలకులకు ఉండాల్సిన చిత్తశుద్ది అంటూ సీఎం ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించిందన్నారు. ఎందరో ఆర్టీసీ కార్మికుల కృషితో ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుందంటూ కార్మికులను అభినందించారు.
పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలను రూ.500లకే గ్యాస్ సిలిండర్.. పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, ప్రతీ నెలా ఒక కుటుంబానికి 10వేలు ప్రయోజనం పొందేలా పథకాల అమలు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 25లక్షల 35 వేల రైతు కుటుంబాలకు మొదటి ఏడాదిలోనే 21కోట్లతో రైతు రుణమాఫీ చేసినట్లు, వరి వేసిన వారికి గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని, అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు.. అందుకే రైతులు సన్నాలు పండించాలని తెలంగాణ రైతులకు సీఎం సూచించారు.
తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో, రేషన్ షాపుల్లో, మధ్యాహ్న భోజనాలకూ సన్నబియ్యం అందిస్తామని, ఈ నేలలో పండిన పంటనే మన బిడ్డలకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పెకలించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
నోటిఫికేషన్లు ఇచ్చి బీఆర్ఎస్ పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా.. ఏ లక్ష్యం కోసం అమరుల ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు మరోమారు సీఎం పునరుద్ఘాటించారు.
నగరంలో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖది కీలక పాత్రగా అభివర్ణించిన సీఎం, కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు పంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీఎం అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతామని సీఎం అన్నారు.
Also Read: PSLV-C59 Launch: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం సక్సెస్.. చప్పట్లతో మార్మోగిన ఇస్రో
హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించాలని అధికారులను సభావేదికపైనే ఆదేశించారు సీఎం. నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చాల్సిన బాధ్యత మనపై ఉందని, అవసరమైతే కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకునైనా సరే హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని పారదోలుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.