Public Garden: రజాకార్ల చెర నుంచి విముక్తి పొంది తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు సెప్టెంబర్ 17. కానీ ప్రతి ఏటా ఈ ప్రత్యేకమైన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే దానిపై ఒక్కొక్కరిది ఒక్కో బాట. ఈసారి కూడా అదే జరుగుతోంది. పోటా పోటీగా సెప్టెంబర్ 17 కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతోంది. విలీనమా..? విమోచనమా.. అంటూ మరోసారి సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరుతో వేడుకలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది.
పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో హైదరాబాద్ లిబరేషన్ డే
మరోవైపు ఇది కచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ వేడుకలకు రెడీ అయింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండేళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ.. మరోసారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో మూడో ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాబోతున్నారు.
విమోచన దినోత్సవ చరిత్రను తెలిపే వర్చువల్ మ్యూజియంను ప్రజలకు చూపించాలి..
మంగళవారమే రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకోగా…పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 8-55 గంటల నుంచి 11-30 వరకు తెలంగాణ విమోచన దినోత్సవ సంబురాల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో పారామిటరీ పరేడ్ నిర్వహించనున్నారు. కళాకారులు తమ కళలను ప్రదర్శించనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ భారతదేశంలో విలీనమవ్వడం గొప్ప చరిత్ర అని, అలాంటి చరిత్రను కొందరు కాలరాస్తున్నారని బీజేపీ లీడర్లు అంటున్నారు. గ్రామ గ్రామాన సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగురవేయించి, విమోచన దినోత్సవ చరిత్రను తెలిపే వర్చువల్ మ్యూజియంను ప్రజలకు చూపించాలని కేడర్‌కు బీజేపీ పిలుపునిచ్చింది.
తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర మంత్రులు
పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 7 గంటలకు రాంచందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Also Read: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం
తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవమంటున్న సీపీఎం..
ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరిపింది. దీన్నే కొనసాగిస్తే వస్తోంది. అలాగే సీపీఎం పార్టీ తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవం అని చెబుతోంది. సీపీఐ సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా జరపాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇక పాతబస్తీని అడ్డాగా చేసుకున్న MIM పార్టీ జాతీయ సమగ్రతా దినోత్సవం అని చెబుతోంది. మొత్తంగా సెప్టెంబర్ 17ను పార్టీకో దినోత్సవంగా జరుపుకుంటున్నారు.