Telangana brs latest news(TS news updates): తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, టిక్కెట్ రేసులో ఉన్న నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివాదాలు మరింత ముదురుతున్నాయి. నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపైమరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వివాదమే జనగాం జిల్లా స్టేషన్ ఘన్ ఫూర్ నియోజకవర్గంలో నడుస్తోంది.
స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఉన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఈ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉన్న నేత. ఇప్పుడు ఈ ఇద్దరు నేతల మధ్య వార్ ముదురుతోంది. ఎమ్మెల్యే రాజయ్య.. మరోసారి కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం అవినీతి తిమింగలం అంటూ హాట్ కామెంట్స్ చేశారు .
ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత? అని రాజయ్య నిలదీశారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని కడియం టికెట్ ఎలా ఆశిస్తారని ప్రశ్నించారు. ఆరుద్ర పురుగుల్లాగా ఎక్కడపడితే అక్కడ కడియం ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయని ఫైర్ అయ్యారు. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టు నువ్వా-నేనా చూసుకుందాం అంటూ కడియం శ్రీహరికి సవాల్ విసిరారు రాజయ్య.
తనపై రాజయ్య చేసిన విమర్శలకు తాజాగా కడియం కౌంటర్ ఇచ్చారు. తన కులం గురించి రాజయ్య చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. తండ్రి కులమే కొడుకులకు వస్తుందన్న సుప్రీంతీర్పు తెలియదా అంటూ ప్రశ్నించారు. తండ్రి అపోహ అంటూ అందరు తల్లులను అవమానించారని విమర్శించారు శ్రీహరి. తనకు ఉన్న ఆస్తుల వివరాలు, వాటి డాక్యుమెంట్లు తెచ్చి ఇస్తే వాటిని స్టేషన్ ఘన్ పూర్ దళితులకే రాసిస్తానని రాజయ్యకు సవాల్ విసిరారు. తాను స్టేషన్ ఘన్ పూర్ ను అభివృద్ధి చేయలేదన్న రాజయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కడియం. ఆ తర్వాత రాజయ్య స్పందించారు. కడియం బీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆయన ఎక్కడికి పోయినా ఫరవాలేదు కానీ… దళితుల జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు రాజయ్య. ఇలా ఈ ఇద్దరు బీఆర్ఎస్ బడా లీడర్ల మధ్య డైలాగ్ వార్ ఆ పార్టీలో కలవరం రేపుతోంది.