
KTR News(TS news updates):
కల్వకుంట్ల కుటుంబానికి రక్షా బంధన్ అంతగా కలిసి రావట్లేదేమో. తండ్రి కేసీఆర్ మాత్రం సంప్రదాయాలను బలంగా ఫాలో అవుతుంటారు. యాగాలు, గుళ్ల సందర్శనలతో పాటు పండుగలూ ఘనంగా జరుపుకుంటారు. ప్రతీ రాఖీ పండగకి ఆయన తోబుట్టువులు ఇంటికొచ్చి రాఖీ కడుతుంటారు. ప్రతీ ఏటా రాఖీ కట్టించుకునే కేసీఆర్.. తన పిల్లలతో మాత్రం ఏటేటా రాక్షబంధన్ జరిపించలేకపోతున్నారు. ఈ మూడేళ్లలో కవిత.. కేటీఆర్‌కు రెండేళ్లు రాఖీ కట్టలేదు. ఈ విషయంలో తండ్రిగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారనే అంటున్నారు.
మొదట్లో అన్నాచెల్లెలు బానే ఉండేవారు. కవిత ఏటేటా కేటీఆర్‌కు రాఖీ కట్టేవారు. ఓ ఏడాది రాఖీకి.. బ్రదర్‌కు హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వాలంటూ పెద్ద ఉద్యమమే నడిపించారు. అలాంటిది రెండేళ్ల క్రితం వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. పదవుల కోసం ఆధిపత్య పోరు తారాస్థాయిలో నడిచిందని చెబుతారు. నెలల తరబడి చెల్లి కవిత.. అన్న మీద కోపంతో రగిలిపోయారు. ప్రగతిభవన్‌లో అడుగే పెట్టలేదు. కొడుకు మీద ప్రేమతో కూతురును తండ్రి కేసీఆర్ పూర్తిగా పక్కనపెట్టేశారని అన్నారు.
ఆ సమయంలోనే రాఖీ పండుగ వచ్చింది. 2021లో అన్నకు రాఖీ కట్టకుండా చెల్లి డుమ్మా కొట్టారు. “కేటీఆర్‌కు రాఖీ కట్టని కవిత”.. అంటూ బ్రేకింగ్ న్యూస్‌లతో మీడియా హోరెత్తింది. వారిద్దరి మధ్య వార్ మరింత ఓపెన్ అయిపోయింది.
ఎంతైనా రక్త సంబంధం కదా.. కోపతాపాలు ఎన్నాళ్లు ఉంటాయి? రాజకీయ అవసరాల కోసం అన్నాచెల్లెళ్లు మళ్లీ ఏకమయ్యారు. ఎప్పటిలానే కలిసి పాలిటిక్స్ చేస్తున్నారు. గతేడాది కలిసి రాఖీ పండుగ చేసుకున్నారు. కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు.
ఎన్నికల ఏడాదిలో మళ్లీ రాఖీ పండుగ రానే వచ్చింది. ఈసారి మాత్రం కేటీఆర్‌కు కవితకు రాఖీ కట్టలేకపోయారు. మళ్లీ వారి మధ్య గొడవలు, విభేదాలు వచ్చాయా?
ప్రస్తుతం కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. ఆయన యూఎస్ వెళ్లి వారం దాటేసింది. అక్కడ ఏం చేస్తున్నారనే దానిపై ఎలాంటి లీకులూ రావట్లేదు. ఎన్నికల ముందు కేటీఆర్ అమెరికా పర్యటన వెనుక ఏదో మతలబు ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎలక్షన్ ఫండ్, హవాలా డబ్బులు.. ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కేటీఆర్ అమెరికా వెళ్లి చాలా రోజులే అవుతోంది. రేపోమాపో వచ్చేస్తారని అంటున్నారు. అదేదో రాఖీ పండుగకే రావొచ్చుగా? చెల్లితో రాఖీ కట్టించుకోవచ్చుగా? రాఖీ కంటే ముఖ్యమైన డీల్ ఏముందక్కడ? అనే మాటలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌లా ఆయన పిల్లలు రక్షాబంధన్‌కు అంత విలువ, ప్రాధాన్యం ఇవ్వట్లేదనే విమర్శలు ఉన్నాయి. కలిసున్నప్పుడు రాఖీ కట్టడం.. గొడవలుంటే రాఖీకి డుమ్మా కొట్టడం.. పనులుంటే రాఖీని వదిలేసి విదేశాలకు వెళ్లిపోవడం.. ఇలా రాఖీ పండుగ కంటే వారికి రాజకీయ అవసరాలే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టినా.. కట్టకపోయినా.. ఏటేటా అది హాట్ టాపిక్‌గానే మారుతుండటం ఆసక్తికరం.